Mission Bhagiratha in Asifabad : వాగులు, చెలిమెల నీరు తాగి అనేక రకాల వ్యాధులతో సతమతమైన గిరిజన ప్రాంతాలు భగీరథ నీటి సరఫరాతో క్రమేపీ స్వస్థత పొందుతున్నాయి. మెరుగైన వైద్య పరిస్థితులూ ఇందుకు దోహదం చేస్తున్నాయి. కలుషిత నీటితో ప్రధానంగా డయేరియా విజృంభిస్తుంది. టైఫాయిడ్, కామెర్లు వంటివి పీడించుకు తింటాయి. దేశంలో వెనుకబడిన 125 జిల్లాలను నీతి ఆయోగ్ గుర్తించగా, అందులో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంది.
నీటితో ప్రాణాలు సైతం పోయిన సందర్భాలు: ఈ జిల్లాలో 1,142 గ్రామాలు ఉండగా కలుషిత నీటితో ప్రాణాలు సైతం పోయిన సందర్భాలు ఉన్నాయి. కిప్రోస్టోరిడియం, ఈకోలి బ్యాక్టీరియాలు, షెగెల్లా క్రిములు వాగులు, చెలిమెల్లో మిళితమై ఉండడం, ఈ నీటినే ఇక్కడి ప్రజలు తాగడంతో టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధుల బారిన పడేవారు. కొన్ని చోట్ల చాలా లోతుకు బోర్లు వేసి కఠినమైన జలాలను తీసుకునేవారు. దీంతో కిడ్నీలు చెడిపోయిన ఘటనలు లింగాపూర్, సిర్పూర్(యు) మండలాల్లో ఉన్నాయి.
భౌగోళికంగా 220-280 మీటర్ల ఎత్తు కొండలతో ఉండే జిల్లాలో అన్ని గ్రామాలకు అతికష్టం మీద అధికారులు భగీరథ నీటిని అందిస్తున్నారు. 2018 నుంచి ప్రత్యేక జీఏ పైప్‌లైన్లు వేసి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దీనివల్ల కలుషిత నీటి వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వైద్యులు గుర్తించారు. వైద్య సేవల విస్తరణ, పారిశుద్ధ్య పరిస్థితులపై పెరుగుతున్న అవగాహనతో ఆదివాసీల ఆరోగ్యాలు మెరుగుపడుతున్నాయి. మలేరియా, డెంగూ వంటివీ దారికొస్తున్నాయి.
మాతాశిశు మరణాల్లోనూ తగ్గుదల: ఈ జిల్లాలో 2016లో మలేరియా కేసులు 713 నమోదవగా ఆ తర్వాత కొద్దిగా హెచ్చుతగ్గులున్నా 2021 నాటికి 77కి చేరాయి. ఈ సంవత్సరంలోనూ అటూఇటుగా అదే పరిస్థితులున్నాయి. ఆసుపత్రి ప్రసవాలు, కేసీఆర్ కిట్ వంటివాటితో మాతాశిశు మరణాల్లోనూ తగ్గుదల కనిపిస్తోంది. 2018లో ఈ జిల్లాలో 15 మంది గర్భిణులు ప్రాణాలు కోల్పోయినట్లు నమోదైంది. 2021లో 6, 2022లో ఇప్పటిదాకా 3గా రికార్డయ్యాయి. శిశు మరణాలు 2018లో 28 కాగా ఈ సంవత్సరం ఇప్పటికి 21గా ఉంది.
మహిళలకు తప్పిన నడక బాధ: భగరీథ నీటి సరఫరా కారణంగా మహిళలకు కిలోమీటర్ల దూరం నడిచే బాధ తప్పింది. ప్రతి ఇంటికి 100 లీటర్ల తాగునీరు సరఫరా కావడంతో ఇంతకు ముందులా టబ్బుల్లో, బకెట్లలో నీటి నిల్వ తగ్గిపోవడంతో దోమలకు ఆవాసం కరవై మలేరియా వ్యాప్తి క్రమంగా దూరమవుతోంది. ‘‘2013 నుంచి 2019 వరకు ఉట్నూర్ అదనపు వైద్యాధికారిగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహించా. మిషన్ భగీరథ నీరు సరఫరా ప్రారంభమయ్యాక, అంతకు పూర్వం నివేదికలు పరిశీలించాం. డయేరియా, టైఫాయిడ్ కేసుల్లో తేడా బాగా వస్తోంది. కలుషిత నీటితో వాటిల్లే వ్యాధులు తగ్గుముఖం పడుతున్నాయన్నది సుస్పష్టంగా తెలుస్తోంది’’ అని వివరించారు ప్రస్తుత డీఎంహెచ్‌వో ప్రభాకర్ రెడ్డి.
ఇవీ చదవండి: 'ప్రాణం పెట్టి చదివి.. కొలువులు కొట్టండి'.. యువతకు కేటీఆర్ లేఖ
అమ్మతో ముచ్చట్లు ఆశీర్వాదం తీసుకుని చిరునవ్వులు చిందించిన మోదీ