కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన (ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నయ్య) కోనేరు సాంబశివరావుకు వ్యవసాయం అంటే మక్కువ. వ్యవసాయం చేస్తూనే అనుబంధంగా పదేళ్ల నుంచి కోళ్ల పెంపకం చేస్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో పెరటి కోళ్లు, నాటు కోళ్లు పెంచుతూ ఉంటారు. అయితే రెండేళ్ల క్రితం విజయవాడ వెళ్లిన సందర్భంలో జాతి కోళ్లు తనను బాగా ఆకర్షించాయని సాంబశివరావు తెలిపారు. ఒక్కో కోడి బరువు 5 నుంచి 8 కిలోల వరకు ఉండటం, ధర కూడా వేలల్లో ఉండటం వల్ల ఆ రకం జాతి కోళ్లను తమ ప్రాంతంలో పరిచయం చేయాలని అనుకున్నారు.
ఆ రకం జాతి కోళ్లు తెలంగాణ ప్రాంతంలో చాలా అరుదుగా పెంచుతారని గ్రహించిన సాంబశివరావు తమ ప్రాంతంలోనూ పెంచాలని నిర్ణయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా మొదటి విడతలో 10 మెట్టవాటం, రేజా జాతి కోళ్లను తీసుకువచ్చారు. తనకున్న రెండెకరాల స్థలంలో జాతి కోళ్ల పెంపకం మొదలు పెట్టారు.
ప్రణాళిక ప్రకారం దాన:
మాములు కోళ్లతో పోలిస్తే జాతి కోళ్ల పెంపకం కాస్త భిన్నంగా ఉంటుంది. వాటి పెంపకంలో ప్రత్యేక పద్ధతులు పాటిస్తారు. వాటి పెంపకం కోసం ప్రత్యేకంగా ఇద్దరిని కృష్ణ జిల్లా నుంచి తీసుకువచ్చారు రైతు సాంబశివరావు. ఉదయం నుంచి రాత్రి వరకు వాటికి ఒక ప్రణాళిక ప్రకారం దాన అందిస్తూ.. వాటి బాగోగులు చూస్తుంటారు. దానాలో రాగులు, సజ్జలు, గోధుమ రవ్వ, గుడ్లు, నిమ్మకాయ, పంచదార నీళ్లు లాంటివి ఇస్తుంటారు. ఆరు నెలల వరకు ఒకరకమైన దాన వేస్తూ.. ఆ తర్వాత ప్రతిరోజు ఉదయం ఒక గుడ్డు, ఒకపూట 200 గ్రాముల సజ్జలు, సొల్లు, జొన్నలు, మిశ్రమంగా ఇస్తుంటారు.
ముందుముందు మరిన్ని రకాలు:
ప్రస్తుతం తన వద్ద మెట్టవాటం, రేజా జాతి కోళ్లలో నెమలి, కాకి, కొళ, మైల, నెమలి డేగ లాంటి రకాలు ఉన్నాయన్నారు రైతు సాంబశివరావు. మొత్తంగా 150 కోళ్ల వరకు పెంచుతున్నానని.. ముందుముందు మరిన్ని రకాలు తీసుకువస్తానని తెలిపారు. ఇప్పటివరకు జాతి కోళ్ల పెంపకం కోసం పదిలక్షల వరకు పెట్టుబడి అయిందని తెలిపారు. ఆంధ్ర ప్రాతంలో ఒక్కో కోడి ధర 20,000 నుంచి 50,000 వరకు పలుకుతుందన్నారు. ఇక్కడ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయని.. 5,000 నుంచి 10,000 వరకు ధర పలుకుతుందని తెలిపారు. జాతి కోళ్ల పెంపకం ఈ ప్రాంతంలోను అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో రాబడి గురించి ఆలోచించకుండా ముందడుగు వేశానని రైతు సాంబశివరావు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: దుబ్బాకలో 12 రౌండ్లు పూర్తి.. 4,030 ఓట్ల ఆధిక్యంలో భాజపా