కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లోని కాగితపు పరిశ్రమలో అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో విద్యుత్ ప్లాంట్ కోసం జరుగుతున్న బాయిలర్ నిర్మాణంలో ఒక్కసారిగా మట్టి పెల్లలు కూలిపడ్డాయి. దాంతో కింద పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతిచెందగా మరో అయిదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు జార్ఖండ్‌కు చెందిన రఘునాథ్ రాం(38), చోటు బనియా(25), రంజిత్లుగా గుర్తించారు. అదే రాష్ట్రానికి చెందిన రవిదాస్, సంతోష్ రాం, ఫనీఖాన్ రాం, రాం ప్రణీత్, సంజయ్ రాం గాయపడ్డారు.
పరిశ్రమలో ఒక్కో షిఫ్టులో సగటున పన్నెండు మంది కార్మికులు పనిచేయాల్సి ఉండగా... ప్రమాదం జరిగిన చోట తొమ్మిది మంది కార్మికులు విధులు నిర్వహించారని తేలింది. గాయపడిన కార్మికులంతా మట్టికుప్పల్లో చిక్కుకుని ఉండడం వల్ల ప్రత్యేక జేసీబీల ద్వారా బయటకు తీసే ప్రయత్నం చేశారు. నిన్నరాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకూ మృతులు, క్షతగాత్రులను బయటకు తీసి మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పనుల నిర్వహణలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు, కాగితపు పరిశ్రమ అధికారులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. కర్మాగారం పున: ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు అంతా బయటి రాష్ట్రాలకు చెందినవారే!
ఇవీ చూడండి: గిరిజన సంక్షేమ బడ్జెట్‌పై మంత్రుల సమీక్ష