Bear Attacked Two People in kagaznagar: ఇటీవల ప్రజలపై జంతువుల దాడులు పెరిగిపోయాయి. మొన్నటి దాకా కుక్కలు, కోతులు, పులులు, చిరుతపులుల దాడులతో బయటకు రావడానికే జంకుతున్న ప్రజలను ఇప్పుడు ఎలుగుబంట్ల దాడులు భయపెడుతున్నాయి. ఈ మధ్యకాలంలో అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఏనుగులు, పులులు, కోతులు, ఎలుగుబంట్లు వంటి అడవి జంతువులు తరచుగా జనావాసాల్లోకి వస్తూ ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. ఈ దాడుల్లో కొందరు తీవ్రంగా గాయపడితే.. మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు.
తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలో ఎలుగుబంటి దాడి కలకలం సృష్టించింది. వేర్వేరు చోట్ల తెల్లవారుజామునే ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచింది. అదే ప్రాంతంలోని లోనవెల్లి గ్రామానికి చెందిన అవనిధర్ గౌడ్‌పై దాడి చేసింది. గ్రామ శివారులో ఉదయపు నడకకు వెళ్లిన అతనిపై పొదల మాటున దాక్కున్న ఎలుగుబంటి ఒక్కసారిగా దాడికి తెగబడింది. స్థానికులు గమనించి ఎలుగుబంటిని దూరంగా తరిమేశారు.
అదే ప్రాంతంలోని టోంకిని చెందిన భువనేశ్వర్ అనే వ్యక్తి మక్క చేనుకు నీళ్లు పెట్టి.. వస్తుండగా ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగు ధాటిలో ఈ ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి సంచారంతో అక్కడ నివసించే స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి.. ఎలుగుబంటిని అడవిలో విడిచి పెట్టాలని కోరారు.
గత కొంత కాలంగా జంతువుల దాడులు: గతేడాది ఇద్దరు చిన్నారులు చెరువు గట్టుకు స్నానానికి వెళ్తే.. కోతుల గుంపు వారిపై దాడికి దిగింది. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ చిన్నారులు చెరువులోకి దిగడంతో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో వృద్ధురాలిపై కోతుల గుంపు విచక్షణారహితంగా దాడి చేశాయి. మరోవైపు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పులులు సంచరించి.. మనుషులపై దాడి చేసి వారిని గాయపరుస్తున్నాయి.
మరోవైపు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కుక్కల దాడులు అధికంగా జరుగుతున్నాయి. వీటి దాడి వల్ల హైదరాబాద్‌లోని ఒక బాలుడు మరణించాడు. ఆ తర్వాత మరింతగా వీటి దాడులు పెరిగిపోయాయి. ఈ శునకాల దాడుల గురించి ప్రభుత్వం కూడా తలలు పట్టుకుందంటే.. సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కల దాడులు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఇవీ చదవండి: