కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను పెద్ద పులులు వణికిస్తోన్నాయి. కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్న పులులు 8 ఉన్నట్లు సమాచారం. ఇందులో నాలుగైదు మగవి. మిగతావి ఆడవి. మహారాష్ట్ర నుంచి కొంతకాలం క్రితం మూడు పులులు, రెండ్రోజుల క్రితం మరో పులి వచ్చింది. దీంతో ఇక్కడ వీటి సంఖ్య 12కు చేరింది.
మగపులులే పశువుల్ని వేటాడుతున్నాయి
సహజంగా ఒక్కో పులికి ప్రత్యేక సామ్రాజ్యం ఉంటుంది. కలయిక కోసమే మగపులి తన భాగంలోకి ఆడపులిని రానిస్తుంది. ఇలాంటిచోట మగపులి పశువుల్ని వేటాడి చంపి ఆహారాన్ని ఆడపులికి తెచ్చిపెడుతున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు.
మేతకు వస్తున్న పశువులపై దాడులు
పులుల ఆహార జంతువులు చుక్కలదుప్పి, సాంబర్, జింక, చౌసింగా, అడవిదున్న వంటి శాకాహార జంతువులు... కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో పెద్దపులులు వేట దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో మేతకు వస్తున్న పశువులపై పడుతున్నాయి. ఈ డివిజన్‌లో రెండున్నరేళ్లలో 266 పశువులు పెద్దపులులకు ఆహారంగా మారాయి. తాజాగా మనుషులపైనా దాడులకు దిగుతుండటం కలవరం కలిగిస్తోంది. ఇటీవలి ఘటనల్లో ఓ యువతి, మరో యువకుడు పులిపంజాకు బలైన విషయం తెలిసిందే. అడవిలో శాకాహార జంతువులు తక్కువ కావడంతోనే పులులు పశువులపై పంజా విసురుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మనుషులపై పులుల దాడుల నివారణకు అటవీశాఖ ఇటీవల నియమించిన ఇమ్రాన్‌సిద్దిఖి క్షేత్రస్థాయి పరిశీలనలో ఇదే విషయాన్ని గుర్తించారు.
50 శాకాహార జంతువుల్ని తింటుంది
నిపుణుల లెక్కల ప్రకారం.. ఒక పెద్దపులి ఆకలి తీరాలంటే వారానికి కనీసం ఒకటి చొప్పున ఏడాదికి 50 శాకాహార జంతువుల్ని తినాలి. అంటే ఒక పెద్దపులి ఉండే ప్రాంతంలో 5-6 వందల శాకాహార జంతువులుండాలి. కాగజ్‌నగర్ డివిజన్‌లో 8-12 వరకు పులులున్నాయి. అంటే 4-7 వేల వరకు శాకాహార జంతువులు ఉండాలి. కానీ ఇక్కడ పులులు వేటాడే డీర్‌లు 100-150, చుక్కలదుప్పులు 1,050, చౌసింగాలు 1,500, అడవిదున్నలు 15 కలిపి 2,700 మాత్రమే ఉన్నాయి. పులులు సాంబార్లను బాగా ఇష్టపడతాయి. అవి ఇక్కడ స్వల్పంగా ఉన్నాయి. వేటగాళ్లు వేట కుక్కల్ని అడవుల్లోకి తీసుకొస్తుండటంతో అవి సాంబార్లను చంపుతున్నాయని, అందుకే వాటి సంఖ్య పెరగట్లేదని ఓ అధికారి ‘ఈటవీభారత్తో అన్నారు. ఈ డివిజన్‌లో మొత్తం 900 చ.కిమీ అటవీ ప్రాంతంలో దశలవారీగా 400 చ.కిమీ అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా రక్షణఏర్పాట్లు చేపట్టామని.. తాజాగా మరికొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: మళ్లీ పులి భయం... మన్యంలో అదే కలవరం