Ponguleti Srinivas Comments on BRS: రానున్న ఎన్నికల్లో తాము ఏ పార్టీలో చేరుతామో ఆ పార్టీనే అధికారంలోకి రానుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం.. బీఆర్‌ఎస్ పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రభుత్వం మరో ఐదారు నెలలు మాత్రమే మనుగడలో ఉంటుందని పొంగులేటి జోస్యం చెప్పారు. ఆ విషయాన్ని మరిచిపోయి అధికారులు వారికి తొత్తులుగా ప్రవర్తిస్తే.. సహించేది లేదని హెచ్చరించారు. తనతో పాటు తన వెంటే ఉన్న అనుచరులకు భద్రతను తగ్గించారన్నారు. సెక్యూరిటీ తగ్గించడం వల్ల తమకు ఏమైనా ప్రాణ హాని కలిగితే.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇద్దరు ఎస్పీలే బాధ్యత వహించాల్సి వస్తోందని తెలిపారు.
బీఆర్‌ఎస్ కండువా కప్పుకుంటేనే రైతు బంధు: బీఆర్‌ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్న రైతుల అకౌంట్‌లోనే ప్రభుత్వం డబ్బులు వేస్తోందని.. ఇతర పార్టీలకు చెందిన రైతులకు నగదు జమ చేయడం లేదని విమర్శించారు. వారిని అసలు రాష్ట్ర ప్రభుత్వం రైతులుగా గుర్తించడం లేదని మండిపడ్డారు.
Ponguleti Opened Camp Office Bhadradri: రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేళ్లు అయితే.. ఆ పేరుతో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీలో తెలంగాణ ఉందని ఏకంగా ఆ పేరునే బీఆర్‌ఎస్‌గా మార్చిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తారని వ్యంగ్యంగా మాట్లాడారు. అధికారుల తీరుపై విమర్శలు చేస్తున్న కార్యకర్తలను ఇబ్బంది పెడితే మాత్రం.. రానున్న రోజుల్లో తప్పనిసరిగా గుణపాఠం చెప్పాల్సి వస్తోందని హెచ్చరించారు. అందుకు ఎంతో కాలం కుదరదని మరో ఐదు, ఆరు నెలల్లో అన్న విషయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ విస్మరించవద్దని సూచించారు.
"ఈ జిల్లాలో ఉన్న పోలీసులు ప్రజా ప్రతినిధులకు, బీఆర్‌ఎస్ నేతలకు అండగా నిలుస్తున్నారు. సామాన్య ప్రజానికాన్ని గాలికి వదిలేశారు. మీ ఆటలు ఇక సాగవు. మరో ఐదారు నెలల్లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయం. రానున్న ఎన్నికల్లో తాము ఏ పార్టీలో చేరతామో.. ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. జిల్లాలోని ప్రజలకు చేరువయ్యేందుకే పార్టీ క్యాంపు కార్యాలయాన్ని స్థాపించాం. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాం. నిత్యం ప్రజలతోనే ఉంటాను"- పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ
ఇవీ చదవండి: