మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా... కొన్ని గ్రామాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. మారుమూల పల్లెల్లో ప్రజలు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఖమ్మం జిల్లా ఆరికాయలపాడు గ్రామస్థులు సరైన తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు.
చెలిమల నీరే ఆధారం
మూడు దశాబ్దాలుగా ఇక్కడి గ్రామస్థులకు చేతిపంపులు, చెలిమల ఊట నీరే ఆధారం. గ్రామంలో బోర్లు, రక్షిత ట్యాంకు ఉన్నప్పటికీ అవి ఉప్పునీరు కావడం వల్ల వాటిని వినియోగించడం లేదు. ఆ నీళ్లు తాగితే ఫ్లోరైడ్ సమస్య వస్తుందనే భయంతో చెలిమ నీటినే వాడుతున్నారు.
పట్టించుకునేవారేరీ...?
ఎన్నికల సమయంలో సమస్య పరిష్కరిస్తామని చెప్పి... అనంతరం వీరిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆర్థికంగా ఉన్నవాళ్లు ప్రైవేటు వాహనాల్లో వచ్చే శుద్ధ జలాలు పట్టుకుంటున్నారని... మిగిలిన వారు ఏటి నీళ్లనే వాడుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. మిషన్ భగీరథ పనులు ఏడాదిగా నత్తనడకన సాగుతున్నాయని... త్వరగా పూర్తి చేసి తాగునీటి సమస్యను తీర్చాలని ఇక్కడి వారు కోరుతున్నారు. తాగునీటికి తాము పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని... తమ లాంటి మారుమూల పల్లెల్లో పథకాలను ప్రారంభించడానికి అధికారులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రారంభానికి రావొద్దని జగన్కు భట్టి లేఖ