ఖమ్మం నగరంలో ఆదివారం రాత్రి కుండపోత వర్షంతో జనం సేదదీరారు. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం అయినప్పటికీ వర్షం రాకపోవటం వల్ల ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రెండు గంటలపాటు కురవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
భారీ వర్షంతో నగరంలోని ప్రధాన వీధులన్నీ జలమయం అయ్యాయి. వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరుణుడి రాకతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగింది.