ఖమ్మం జిల్లా మధిరలో అమానవీయ సంఘటన జరిగింది. కరోనా సోకిందని కన్న తల్లినే వదిలేశారు ఆమె కుమారులు. పేగు బంధానికి ఉన్న విలువను కాల రాశారు. అండగా ఉండాల్సిన సమయంలో ఆ వృద్ధురాలిని కనికరం లేకుండా తమ కుటుంబాలతో సహా వెళ్లిపోయారు.
మధిరలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండే గద్దల రాహేల్ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరు కొడుకులు తల్లి వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కూతురు హైదరాబాద్‌లో ఉంటోంది. ఇంతలోనే ఆ తల్లికి కొవిడ్ నిర్ధరణ కావడంతో కుమారులిద్దరూ తమ కుటుంబాలను తీసుకుని వెళ్లిపోయారు.
కౌన్సిలర్ సాయం..
దీనిపై సమాచారం అందుకున్న పురపాలక కౌన్సిలర్ గద్దల మాధురి రెస్క్యూ టీంను పంపించారు. వారు 108 అంబులెన్స్ ద్వారా వృద్ధురాలిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాతృ దినోత్సవం రోజే కన్నతల్లికి ఇలాంటి పరిస్థితి రావడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.