బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దక్షిణ భారతదేశానికి చెందిన మొట్టమొదటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో గట్టెక్కించిన మహానుభావుడని ఎమ్మెల్యే తెలిపారు. భూ సంస్కరణలకు ఆనాడే పీవీ బీజం వేశారన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారు పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎంపీపీ హైమావతి, మున్సిపల్ ఛైర్మన్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.