Revanth Reddy on Puvvada Ajay Kumar: కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమకేసులు, పీడీ యాక్ట్‌లు పెట్టించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాక్షస ఆనందం పొందుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మంత్రి పువ్వాడకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని... అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరంగల్‌లో జరగనున్న రాహుల్ గాంధీ సభ సన్నాహక సమావేశాన్ని ఖమ్మం జిల్లాలో నిర్వహించారు.
'కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్లే. అజయ్ నాకు సవాల్ విసిరారు. తనపై విచారణ చేయిస్తే వాస్తవాలు ఉంటే రాజీనామా చేస్తామ అన్నారు. నేను సూటిగా సవాల్ విసురుతున్న పువ్వాడ అజయ్‌కి. సీబీఐ విచారణకు నువ్వు లేఖ రాయి. నీ కాలేజీ నిర్వాహణ, సిబ్బంది వేతనంలో కోత గురించి అన్నింటిని నిరూపించే బాధ్యత నేను తీసుకుంటా.' - రేవంత్ రెడ్డి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తొలిసారిగా జిల్లాకు రావాలడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జిల్లా సరిహద్దు కూసుమంచి నుంచి ర్యాలీ నిర్వహించి, స్వాగతం పలికారు. నాయకుని గూడెం వద్ద వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాలేరులో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన డీజేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పోలీసులు వాగ్వాదానికి దిగారు.
ఖమ్మం పట్టణంలోనూ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరపాలక సిబ్బంది వాటిని తొలగించటంతో.... పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నగరపాలక వాహనానికి సంబంధించి అద్దాలు ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి : 'పార్టీలో చేరను.. మీ కోసం పని చేయను'.. కాంగ్రెస్‌కు పీకే ఝలక్!