Mother and Daughter Qualified in Police Events : ఆమె పోలీసు కానిస్టేబుల్.. ఎస్సై ఉద్యోగం సాధించేందుకు శ్రమిస్తున్నారు. ఆమె కుమార్తె కూడా తల్లి బాటలోనే ఎస్సై ఉద్యోగానికి పోటీ పడుతున్నారు. ఇద్దరూ బుధవారం ఖమ్మం పరేడ్ మైదానంలో ఒకే బ్యాచ్‌లో శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యారు. ఇద్దరూ అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, తుది పరీక్షకు అర్హత సాధించడం విశేషం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన దారెళ్లి నాగమణి (37) ములుగు పోలీసు స్టేషన్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె భర్త వ్యవసాయ కూలీ. క్రీడల పట్ల ఆమె ఆసక్తిని చూసి భర్త ప్రోత్సహించారు. నాగమణి హ్యాండ్‌బాల్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు.
డిగ్రీ చదివిన ఆమె ఖమ్మంలో కొన్నాళ్లు అంగన్‌వాడీ టీచరుగా పనిచేశారు. తర్వాత 2007లో హోంగార్డుగా ఎంపికై 2018 వరకు విధులు నిర్వర్తించారు. అనంతరం సివిల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. ఎస్సై కావాలన్నదే తన లక్ష్యమని నాగమణి తెలిపారు. పీజీ చదువుతున్న ఆమె కుమార్తె త్రిలోకిని (21) కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశారు. ఎస్సై ఉద్యోగానికి ప్రిలిమ్స్‌లో అర్హత సాధించారు. తల్లితో కలిసి ములుగులో ఈవెంట్ల కోసం సాధన చేశారు. అమ్మలాగే పోలీసు ఉద్యోగం సాధించాలన్నది తన లక్ష్యమని త్రిలోకిని చెప్పారు.
ఇవీ చదవండి: