ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని లచ్చన్నగూడెం, మర్లపాటు గ్రామాల్లో వానాకాలం పంటసాగుపై నిర్వహించిన సదస్సులో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. నూతన సాగు విధానంపై వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతుల సందేహాలు తీర్చి.. వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇకపై కేసీఆర్ ఆదేశాల మేరకు 60 శాతం సన్నరకం, 40శాతం లావురకం ధాన్యం పండించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో పది లక్షల ఎకరాల్లో షుగర్ ఫ్రీ సాంబమసూరి ధాన్యం సాగు చేయాలని రైతులను కోరారు.
వర్షాకాలంలో మొక్కజొన్న పంట సరైంది కాదని.. నిపుణుల సలహా మేరకు సూచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాట రైతులందరూ వినాలని ఎమ్మెల్యే కోరారు. కరోనా కట్టడికి ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ.. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మర్లపాడు, లచ్చన్నగూడెం సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ ఛైర్మన్ హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సంజీవరెడ్డి, ఎంపీపీ వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు సోమిరెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు