శీతల గిడ్డంగుల నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా మిర్చి రైతులు కోట్లరూపాయల నష్టం చవిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఏడాది పంట బాగా పండటంతో... గతేడాది మిగిల్చిన నష్టాల నుంచి బయటపడదామని భావించినా కరోనా వారి పాలిట శాపంగా మారింది. మంచి దిగుబడే వచ్చినా లాక్‌డౌన్‌తో పంటను సకాలంలో అమ్ముకోలేకపోవడం వల్ల శీతల గిడ్డంగుల్లో దాచుకున్నారు. ఆ గిడ్డంగుల నిర్వాహకులు సరైన ప్రమాణాలు పాటించకపోవటంతో తీరని నష్టాలు మూటకట్టుకోవాల్సి వచ్చింది. జిల్లాలోని దాదాపు సగం వరకు శీతల గిడ్డంగుల్లోని వేలాది బస్తాల మిర్చి బూజుపట్టి ఎందుకు పనికిరాకుండా పోయింది.
జిల్లాలో 38 శీతల గిడ్డంగులు
ఖమ్మం జిల్లాలో 38 శీతల గిడ్డంగులు ఉండగా.. వాటిలో 35 లక్షల నుంచి 55 లక్షల వరకు మిర్చి బస్తాలు నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం దాదాపు 35 లక్షల వరకు మిర్చి బస్తాలను రైతులు నిల్వ చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల కర్షకులు కూడా అక్కడే సరకు దాచుకున్నారు. గిడ్డంగుల నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిర్చి బూజుపట్టడంపై విచారణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించటంతో శీతల గిడ్డంగుల యాజమాన్యం నిర్వాకం బయటపడింది. మొత్తం 38 శీతల గిడ్డంగులు తనిఖీ చేయగా.. 13 చోట్ల సరకు పాడైనట్లు నిర్ధరించారు. అందులో ఖమ్మం, మధిర, వైరాలో రెండేసి, మద్దులపల్లిలో 4 ఏసీల్లో పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు.
ఇదీ చదవండిః కరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!