ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలన్నింటికి సీతారామ ఎత్తిపోతల ద్వారా నీరిచ్చే విషయమై ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇంజినీర్లతో... మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాఠోడ్ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. మహబూబాబాద్, ఖమ్మం, ములుగు జిల్లాల్లోని సాగుకు యోగ్యమైన పట్టా భూములన్నింటికీ నీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల ద్వారా ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాలోని సాగుభూమి అంతటికీ నీరిచ్చేలా లక్షా 17వేల ఎకరాల అదనపు ఆయకట్టు కోసం సర్వే చేపట్టనున్నారు. సీతారామ ఎత్తిపోతల కింద 7,70,000 ఎకరాలకు నీరందుతుందని వివరించారు. దీనిలో 6,52,000 ఎకరాలు గతంలోనే ప్రతిపాదించగా మిగిలిన దానికోసం వెంటనే సర్వే చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గార్ల మండలాలకు పూర్తి స్థాయిలో సాగునీరందించేలా సర్వే చేసి, డిజైన్ రూపొందించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు. బయ్యారం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చాలని, మహబూబాబాబాద్ రైల్వే ట్రాక్ దాటించి సాగునీరు అందకుండా మిగిలిన ప్రాంతానికి కూడా సీతారామ ద్వారా గాని... ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందేలా చూడాలన్నారు. సమ్మక్క ఆనకట్టకు అటవీ అనుమతులు వచ్చినందున త్వరగా పూర్తి చేయాలని మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు.
సాగు భూములన్నింటికీ సాగు నీరు
సీతారామ ప్రాజెక్టు వల్ల ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఇల్లెందు, వైరా, పినపాక, కొత్తగూడెం నియోజక వర్గాల్లోని సాగుయోగ్యమైన భూములన్నింటికీ నీరు అందుతుందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. పూర్తి స్థాయిలో సాగునీరు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు చర్చించారు. పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి నివేదిస్తామని అధికారులు చెప్పారు. ఆదివాసీలు, గిరిజనులకు లబ్ధిచేకూరేలా ములుగు జిల్లాలోని పలు వాగులపై 16 చెక్‌డ్యాంలు మంజూరు చేశారు. శ్రీరాంసాగర్ ఆయకట్టు కింద స్థిరీకరణకు ప్రత్యేకంగా ములుగులో సమావేశం నిర్వహించి క్షేత్ర స్థాయిలో సమస్యలను అధ్యయనం చేసి పరిష్కరించాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి: భూరికార్డుల పారదర్శకత కోసమే ధరణి పోర్టల్‌కు శ్రీకారం: సీఎం