కరోనా నియంత్రణపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. అగ్రదేశాలన్నీ కరోనా ధాటికి వణికిపోతున్నాయని....అసలు కరోనాను జయించిన దేశాలేమైనా ఉన్నాయా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోవడం లేదన్న మంత్రి...కరోనా నియంత్రణకు నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా వ్యాధి నిర్ధరణ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్ పంపిణీని కలెక్టర్ కర్ణన్, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పువ్వాడ పంపిణీ ప్రారంభించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి రావడం వల్ల స్థానికంగానే కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్నారు.
ఖమ్మం జిల్లాలో ఆగస్టు నుంచి పూర్తిస్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా సోకిన వారిని అంటరానివారిలా చూడొద్దన్న మంత్రి... ఒకవేళ తనకు కరోనా సోకితే...గాంధీ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటానని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: తెలంగాణలో కొత్తగా 1,524 కరోనా కేసులు, 10 మంది మృతి