Puvvada ajay Comments: రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పాలకుల పీడ విరగడైందని అనుకుంటే.. మళ్లీ తయారవుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పాదయాత్రలో వైతేపా అధ్యక్షురాలు షర్మిల తనపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఘాటుగా స్పందించారు. సమైక్య పాలనలో తెలంగాణ హక్కుగా ఉన్న బయ్యారం ఉక్కును తరలించుకుపోవాలని చూసిన వాళ్లే మళ్లీ బజార్లపై నాట్యమాడుతున్నారని విమర్శించారు.
అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని.. షర్మిలకు తెలంగాణలో ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. భూములు కబ్జాలు చేసిన కుటుంబీకులు మాట్లాడుతుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదన్నారు. నాటి వైఎస్ పాలన, నేటి జగన్ పాలనలో జరుగుతున్న అరచాకాల మాటేంటన్నారు. పరిటాల రవి, మొద్దు శ్రీను హత్య ఘటనలు ప్రజలు మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. వారు చేసిన అరాచకాలకు అరాచకాలే సిగ్గుతో తలదించుకుని పోతుంటే..ఖమ్మంలో అరాచకాలు జరుగుతున్నాయని మాట్లాడుతన్నారన్నారు. వైఎస్‌కు, ఆయన కొడుకు జగన్‌కు డబ్బులు తీసుకుని టికెట్లు ఇవ్వడం, డబ్బులు తీసుకుని మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని పువ్వాడ ఆరోపించారు. నిఖార్సయిన వ్యక్తులకు ఏమీ ఆశించకుండా పదవులు ఇచ్చే నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
"ఉక్కు నుంచి భూముల వరకు అన్ని కబ్జాలు, దందాలు చేసిన ఘనత మీ కుటుంబానిదే. మీ తండ్రి, అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు చూస్తే అరాచకానికే సిగ్గుచేటు. ఒట్టి పుణ్యానికి మంత్రి కాకపోతే మీ అన్నలా డబ్బులిచ్చి తీసుకోవాలా? పనిచేసిన వారినే సీఎం కేసీఆర్ గుర్తించి పదవులు ఇస్తారు.. అందుకు నేను గర్విస్తున్నా. దమ్ముంటే ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలిచి చూపించు. పాలేరులోనూ నా దమ్ము చూపిస్తా." - పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ మంత్రి
ఇవీ చూడండి: