సన్నరకం ధాన్యానికి మద్దతు ధరల పెంపుపై రాష్ట్రంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్న వేళ... వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ధర పెంచే ఆలోచన చేస్తున్నారని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సన్న రకం ధాన్యానికి బోనస్ ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఒకవేళ సన్నాలకు ముఖ్యమంత్రి బోనస్ ఇచ్చిన పక్షంలో కేంద్రం మోకాలొడ్డకుండా బాధ్యత తీసుకుంటారా..? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. రైతులను కాపాడుకునేందుకు ధర పెంచిన పక్షంలో కేంద్రం ప్రతికూల నిర్ణయం అమలు కాకుండా కిషన్ రెడ్డి బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి రఘునాథపాలెం, వీవీపాలెం, ముష్టికుంట్ల, అల్లీపురంలో నూతన రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై వ్యవసాయశాఖ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ.1888 కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా కొనబోమని ఎఫ్సీఐ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా తెలియజేసిందన్నారు. అత్యధిక దిగుబడులు సాధించడమే రైతులు చేసిన పాపమా అని నిరంజన్ రెడ్డి నిలదీశారు.