మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని.. ప్రతీ సవాల్‌ను ఓ అనుభవంగా మార్చుకుంటూ ముందుకెళ్తున్నట్లు అజయ్ కుమార్ తెలిపారు. రెండు జిల్లాల వరప్రదాయని సీతారామ ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతున్నాయని.. వచ్చే వానాకాలం సీజన్‌కు జిల్లా రైతాంగానికి సాగునీరు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని మిగతా నగరాలు ఖమ్మం వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపుతామని.. దసరా నాటికి నగరం కొత్త సొబగులు అద్దుకుంటుందన్నారు. జిల్లాలో ఉనికి కోసం పాకులాడుతున్న ప్రతిపక్షాలు పసలేని విమర్శలు చేస్తున్నాయని మంత్రి పువ్వాడ ఆరోపించారు. ఖమ్మం బల్దియా ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఈ ఏడాదిలో సాధించిన విజయాలు.. భవిష్యత్ లక్ష్యాలు మంత్రి పువ్వాడ మాటల్లోనే..
సవాళ్లను అనుభవాలుగా మార్చుకున్నా:
గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో తెరాస గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నైన నాపై సీఎం కేసీఆర్ నమ్మకంతో మంత్రి పదవి అప్పగించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంత్రినవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశంతో జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నా. ఈ ఏడాది కాలంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి.
మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆర్టీసీ సమ్మె వచ్చింది. సీఎం ఆశీస్సులతో సమ్మెను విరమింపజేసి కార్మికులకు న్యాయం చేయగలిగాం. ఒడిదుడుకుల్లో ఉన్న రవాణాశాఖ ను గాడిలో పెట్టాం. ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపట్టాం. పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం. ఆన్ లైన్ ద్వారా 36 సేవలు అందుబాటులోకి తెచ్చాం. కార్గో సేవల్ని విస్తృతం చేశాం. ఏపీలో జరిగిన బోటు ప్రమాదంలో రాష్ట్ర వాసులకు అండగా ఉండాలన్న సీఎం ఆదేశాలతో అక్కడికి వెళ్లి వారికి భరోసా ఇచ్చాను. సీఎం అభినందించడం ఎప్పటికీ మరిచిపోలేను. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనప్పటికీ ఆ తర్వాత జరిగిన లోక్ సభ, డీసీసీబీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస అఖండ విజయం సాధించడం గర్వంగా భావిస్తున్నా. జిల్లా చరిత్రలో అన్ని ఎన్నికలు గెలవడంతో తెరాసకు బలమైన పునాదికి బీజం పడింది. ఇది రాజకీయంగా నాకు పెద్ద విజయం. కరోనాను జిల్లాలో దీటుగా ఎదుర్కొన్నాం. కరోనా కోరల్లో ఉండి పనిచేశాను. లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిన సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేయడం ఆత్మ సంతృప్తినిస్తుంది. గతంలో ఎన్నడులేని విధంగా ఉభయ జిల్లాల్లో వరదలు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడగలిగాం. ఇలా ఈ ఏడాదికాలంలో ఎదురైన అన్ని సవాళ్లను అనుభవంగానే స్వీకరించి ముందుకెళ్తున్నా.
వచ్చే వానాకాలానికి సీతారామ ద్వారా సాగునీరు:
కాళేశ్వరం, పాలమూరు తర్వాత ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు సీతారామ. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు సీతారామ ప్రాజెక్టు సీఎం ఇచ్చిన గొప్ప వరం. ఉమ్మడి రాష్ట్ర పాలనలో 180 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహించినా ఒక్క ఎకరాకు సాగునీరు అందలేదు. ప్రజల గొంతు తడపలేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీతారామపై పూర్తి సమయం కేటాయించా. ప్రాజెక్టు వడివడిగా ముందుకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. మొదట్లో అనేక సమస్యలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమించి పనుల వేగంలో పురోగతి సాధించాం. ఒకటి, రెండు పంప్ హౌజ్‌లు పూర్తయ్యాయి. 1 నుంచి 8 ప్యాకేజీల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 7 నుంచి 16 ప్యాకేజీల వరకు భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. పనుల్లో వేగం పెంచుతాం. అంచనా వ్యయం దాదాపు రూ. 15 వేల కోట్లకు పెరిగింది. అయినప్పటికీ రైతుల కోసం ఖర్చు చేద్దామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. వచ్చే వానాకాలానికి సీతారామ ద్వారా రైతులకు తొలి ఫలం సాగునీరు అందించి తీరుతాం.
ఏడాడి చివరి నాటికి బీటీపీఎస్ ప్రారంభం:
సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులతోపాటు విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాముఖ్యతనిస్తున్నారు. జిల్లాలో నిర్మితమవుతున్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం నాలుగు యూనిట్లలో తొలి రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మిగిలిన రెండు యూనిట్ల పనులు కొనసాగుతున్నాయి. 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టడం జిల్లాకు గర్వకారణం. విద్యుత్‌లో స్వయం సమృద్ధి వైపు సాగుతున్న రాష్ట్ర ప్రగతిలో బీటీపీఎస్ కూడా పాత్ర పోషిస్తుంది. వచ్చే రెండు మూడు నెలల్లోనే పనులు పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి సీఎం చేతుల మీదుగా బీటీపీఎస్‌ను ప్రారంభిస్తాం.
హైదరాబాద్ తర్వాత ఖమ్మం అనేలా అభివృద్ధి చేస్తా:
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఖమ్మం నగరం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నా. గత ఐదేళ్లు ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రిగా వందల కోట్ల నిధులతో నగరాన్ని అభివృద్ధిలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నా. ఏళ్లుగా తిష్ట వేసిన ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ నగర రూపురేఖలు మార్చేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. లకారం, మినీ లకారం నగరానికి మణిహారంగా నిలుస్తున్నాయి. మురికి కూపంగా ఉన్న గోళ్లపాడును ఆధునీకరిస్తున్నాం. ధంసలాపురం రైల్వే వంతెన పూర్తికావచ్చింది. వెలుగుమట్ల పార్కు, నగరపాలక సంస్థ కార్యాలయం నగరానికి నూతన శోభ తెస్తాయి. ఐటీ హబ్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ నగరానికి తలమానికం. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి రెండు లైన్ల రహదారుల నిర్మాణం చేపడుతున్నాం. ఇచ్చిన హామీ మేరకు 2 వేల రెండు పడక గదుల ఇళ్లను ప్రజలకు అందిస్తా. అక్టోబర్ 2 నాటికి నగరంలో లక్ష్యం మేరకు 140 ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి రోజుకు 150 లీటర్ల మంచినీరు అందిచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. దసరాకు సీఎం చేతుల మీదుగా నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తెవాలన్న సంకల్పంతో ఉన్నాను. జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి గతిని మార్చి జిల్లా ప్రజలకు అన్నిరకాల వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేసాం. ఖమ్మంను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే నా భవిష్యత్ లక్ష్యం. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఖమ్మం నగరం పేరు ఉండాలనేదే నా ఆకాంక్ష.
గుత్తేదారు నిర్లక్ష్యం వల్లనే బస్టాండ్ నిర్మాణం ఆలస్యం:
ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న ప్రస్తుత బస్టాండ్‌తో ప్రజలకు అసౌకర్యం, ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ఇతర జిల్లాల కు రాకపోకలు సజావుగా సాగాలన్న ఉద్దేశంతో అధునాతన బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నాం. కానీ నిర్మాణ పనుల్లో గుత్తేదారు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దీంతో టెండర్లు రద్దు చేసి మరో గుత్తేదారుకు పనులు అప్పగించాం. ప్రస్తుతం పనుల వేగంలో పురోగతి కనిపిస్తుంది. వీలైనంత త్వరలో బస్టాండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను.
బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం:
ఖమ్మం నగరపాలక సంస్థ అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని ప్రస్తుత పాలకవర్గం నిరూపిస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వచ్చే పాలకవర్గం మరింత పారదర్శకతతో పాలన అందించేలన్నదే మా లక్ష్యం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలకు కొనసాగింపుగా మరింతగా దూకుడుగా ముందుకుపోయేలా పాలకవర్గం ఉండాలి. అది తెరాసతోనే సాధ్యం. ఈ నాలుగున్నరేళ్లలో చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమిస్తున్నారు. మళ్లీ కచ్చితంగా ఆశీర్వదిస్తారు. బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం.
ప్రొటోకాల్ గొడవలు ప్రతిపక్షాల సృష్టే:
జిల్లాలో ప్రతిపక్షాలు సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తున్నాయి. మంత్రిని విమర్శించి పెద్దవాళ్లు కావాలని చూస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ముందు ఒకరికి గౌరవం ఇచ్చిన తర్వాతే వారు గౌరవం కోరుకోవాలి. నాకు రాజకీయ పార్టీలు అప్రస్తుతం. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడ పర్యటనలకు వెళ్లినా ముందు స్థానిక ప్రజా ప్రతినిధులతోనే కొబ్బరికాయలు కొట్టించాను. ప్రొటోకాల్ పాటించడం లేదన్నవి కేవలం చౌకబారు విమర్శలే. కరోనా సమయంలో ప్రొటోకాల్ కోరుకోవడం వారి విజ్ఞతకే వదలేస్తున్నా. కరోనా సమయంలో ప్రజలకు చేయూత నివ్వలేని వారికి నన్ను విమర్శించే అర్హత లేదు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం.
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధే ముందున్న లక్ష్యం:
వచ్చే మూడేళ్లలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఉమ్మడి జిల్లాను అగ్రపథాన తీసుకెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పల్లెప్రగతిలో గతంలో 11వ స్థానంలో ఉంటే ప్రస్తుతం మూడో స్థానానికి చేరాం. అగ్రస్థానంలో నిలబడాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఉభయ జిల్లాలో సకాలంలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు పూర్తిచేస్తాం. వ్యవసాయ రంగంలో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్తాం. జాతీయ రహదారులు త్వరితగతిన పూర్తిచేసేలా బాధ్యత తీసుకుంటా. జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. సీఎం ఆశీస్సులతో సాధిస్తానన్న నమ్మకం ఉంది. జిల్లా అభివృద్ధి కోసం ఒక ఇరుసుగా కీలకపాత్ర పోషించడమే వచ్చే మూడేళ్లలో నేను నిర్దేశించుకున్న లక్ష్యం.
ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్