ఖమ్మంలో ప్లాస్టిక్‌ను నిషేధించిన నగరపాలక సంస్థ... వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటోంది. పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా... జనపనార, వస్త్రం, కాగితంతో సంచుల తయారీపై దృషి పెట్టింది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి... మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు కదిలింది. మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘం మహిళలకు పర్యావరణహిత సంచుల తయారీలో శిక్షణనిస్తోంది.
ఆకర్షణీయంగా తయారీ
శిక్షణ పొందిన మహిళలు జనపనార, కాగితం, వస్త్రం, దారాలు ఉపయోగించి రోజువారీగా వాడే సంచులు తయారు చేస్తున్నారు. కాగితంతో తయారు చేసిన పూల బొకేలు, ఫైల్స్, అలంకరణకు వాడే వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. సంచులు కుట్టడంతోపాటు రసాయనాలు లేని రంగులను వాటిపై అద్దడం వల్ల మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకే విక్రయిస్తున్నామని మహిళలు తెలిపారు.
ప్రత్యేక శిక్షణ
శిక్షణలో భాగంగా 160 మందికి తర్ఫీదు ఇస్తున్నారు. ఇప్పటికే 60 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 50 డివిజన్లలో 50 యూనిట్లు ఏర్పాటు చేశారు. 12 రోజుల శిక్షణాకాలంలో సంచులు కుట్టడం, వాటిపై రంగులు దిద్దడం, అద్దాలు, పూసలతో డిజైన్లు వేయడం, అలంకరణ వస్తువులు తయారు చేయడం నేర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి... వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నారు. తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నారు.
మరిన్నీ
పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ తద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు. అతివలు ఆర్థికంగా బలపడేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టాలని స్వయం సహాయక సంఘం సభ్యులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: ప్లాస్టిక్ నుంచి పేపర్ సంచికి మారుదాం...