కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్ బారిన పడినవారు, ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నవారికి వంట చేసుకోవడం కష్టంగా ఉంటోంది. ఇంట్లో కుటుంబసభ్యులు అందరూ కరోనా బారిన పడితే బయటకు వెళ్లి కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చుకోవటం సమస్యగా మారింది. ఇలాంటి ఆపదలో ఉన్న వారికి ఖమ్మంలోని కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయ కమిటీ అండగా నిలుస్తోంది.
భోజనం చేసుకోవడం కష్టంగా ఉన్నవారు చరవాణి ద్వారా ఆలయ కమిటీని సంప్రదిస్తే ఇంటి వద్దకే వెళ్లి భోజనం అందజేస్తున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పంపిణీ చేస్తున్నారు. రోజుకు దాదాపు 100 మంది బాధితులకు ఖమ్మం నగరమంతా తిరిగి భోజనాలు అందిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు తెలిపారు. దీనికోసం రోజుకు 10వేల రూపాయలు ఖర్చు అవుతుందని, మొత్తం ఆలయ కమిటీ భరిస్తుందని చెప్పారు.