Khammam Congress Clash 2023 : ఖమ్మం కాంగ్రెస్‌లో వర్గపోరు అంతకంతకూ ముదురుతోంది. ఈనెల 17న హైదరాబాద్‌లో నిర్వహించనున్న విజయభేరీ బహిరంగ సభకు సన్నాహకంగా నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాల్లో నేతల విభేదాలు భగ్గుమంటున్నాయి. మంగళవారం జరిగిన భేటీలో సీనియర్ల సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. బుధవారం నిర్వహించిన సమావేశాల్లోనూ వర్గపోరు భగ్గుమంది. కార్యకర్తల పరస్పర నినాదాలు, బాహాబాహీలతో ఖమ్మం కాంగ్రెస్ భవన్ రణరంగంగా మారింది.
Clash in Khammam Congress 2023 : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల గ్రూపుల మధ్య అంతర్యుద్ధం అంతకంతకూ రాజుకుంటోంది. ఇప్పటికే భట్టి విక్రమార్క(CLP Bhatti Vikramarka), రేణుకా వర్గాలుగా ఉప్పు నిప్పులా ఉన్న హస్తం పార్టీలో ఇటీవల పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గం తోడవటంతో పరిస్థితి మూడు స్తంభాలాటగా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి(Renuka Chowdhury), పొంగులేటి వర్గీయులు పోటాపోటీగా టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికి వారే ప్రచారం మొదలు పెట్టారు. గ్రూపుల వారీగా తమ నేతల ఫొటోలతో ఎవరికి వారే గడప గడపకూ కాంగ్రెస్ పేరిట ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యనేతలు మాత్రం పాత, కొత్త నేతల కలయికతో 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామంటూ సమావేశాల్లో ప్రకటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈనెల 17న హైదరాబాద్ శివారు తుక్కుగూడలో నిర్వహించనున్న విజయభేరీ బహిరంగ సభ(Congress Vijayabheri Sabha)ను విజయవంతం చేసేందుకు రెండ్రోజులుగా సాగుతున్న సన్నాహక సమావేశాలు కాంగ్రెగ్‌లో గ్రూపు రాజకీయాలను బహిర్గతం చేస్తున్నాయి. మంగళవారం ఏఐసీసీ పరిశీలకులు మహమ్మద్ ఆరిఫ్ నసిం ఖాన్ సమక్షంలోనే గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. జిల్లా సన్నాహక సమావేశంలో భట్టి, రేణుకాచౌదరి, పొంగులేటి వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేయడం, పరస్పరం జై కొట్టుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది.
Renuka Bhatti Clash in Khammam : మంగళవారం రోజున 4 నియోజకవర్గాల భేటీ జరగగా.. బుధవారం మరో 3 నియోజకవర్గాల సమావేశం నిర్వహించారు. ఖమ్మం నియోజకవర్గం సమావేశంలో భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) వర్గాల నినాదాలు హోరెత్తాయి. సత్తుపల్లి సమావేశంతో పార్టీ కార్యాలయం రణరంగంగా మారింది. టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్, మానవతారాయ్, వక్కలగడ్డ చంద్రశేఖర్ భారీగా అనుచరులతో వచ్చారు. మట్టా దయానంద్, మానవతారాయ్ వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. పోటాపోటీ నినాదాలు చేసుకుంటూ కార్యకర్తలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు.
ఈ గొడవలో కొంతమంది కార్యకర్తలకు స్వల్ప గాయాలై రక్తాలు కారాయి. దాదాపు అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో సమావేశం అర్థంతరంగా నిలిపేశారు. కాసేపటి తర్వాత మళ్లీ సమావేశం నిర్వహించి జనసమీరణపై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికకు ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్న వేళ.. రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు తలెత్తుతాయన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
Congress Vijayabheri Sabha Arrangements : చరిత్రలో నిలిచేలా కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ..!