Khammam BRS Disputes 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి చేదు అనుభవాలను మిగిల్చాయి. ఈసారి అలాంటి పరిస్థితులకు తావులేకుండా ఎక్కువ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో.. ముందుగానే అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ప్రభుత్వ పథకాలు, జిల్లాలో చేసిన అభివృద్ధే పార్టీని గెలిపిస్తుందనే ధీమాతో ఉంది.
Khammam BRS MLA Candidates Issues : కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్లో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా మారింది. ఏకంగా పార్టీ అభ్యర్థులనే వ్యతిరేకిస్తున్నారు. మరికొన్ని చోట్ల అభ్యర్థుల తీరుపై అంతర్గతంగా అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. కొత్తగూడెంలో దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మీ పథకాల లబ్ధిదారుల ఎంపికలో తమ వర్గీయులకు ప్రాధాన్యం ఇవ్వలేదని కొందరు నేతలు రగిలిపోతున్నారు. కొంతమంది కౌన్సిలర్లు అంతర్గతంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని సమాచారం. మధిరలో తిరుగుబావుటా ఎగురవేసిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ఇప్పటికే ప్రకటించారు.
Khammam BRS Politics 2023 : వైరా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ మధ్య రాజీ కుదిర్చేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రయత్నించారు. ఇరువురు నేతలు వేదికలపై కలిసే పాల్గొంటున్నప్పటికీ.. ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. భద్రాచలంలో తెల్లం వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని పార్టీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బోదెబోయిన బుచ్చయ్య వర్గీయులు బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
భద్రాచలం ఇంఛార్జిగా తనను తప్పించి.. తాత మధుకు బాధ్యతలు అప్పగించడంపై.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బాలసానిని కలిసి.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బుజ్జగించారు. హరీశ్‌రావుతో మాట్లాడించినట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన బీసీ నేతగా ఉన్న బాలసాని లక్ష్మీనారాయణను పార్టీలోకి తీసుకొచ్చేందుకు.. కాంగ్రెస్ ముఖ్యనేతలు సంప్రదింపులు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
BRS Manifesto 2023 Release Date : ఈ నెల 15న బీఆర్‌ఎస్ మేనిఫెస్టో.. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్లు
ఇల్లందు బీఆర్ఎస్ అసమ్మతి.. చినికి చినికి గాలివానలా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ హరిప్రియనాయక్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చాల్సిందేనంటూ అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు. మండలాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. హరిప్రియతో ఎన్నికలకు వెళ్తే పార్టీకి నష్టం తప్పదని వాదిస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు నియోజకవర్గ ఇంఛార్జి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొందరిని హరీశ్‌రావు దగ్గరికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇవ్వడంతో.. కొందరు నేతలు వెనక్కి తగ్గినట్లు సమాచారం.