ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలలో విషాదం చోటుచేసుకుంది. సాగర్ కాలువలోకి ఈతకెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థి నీట మునిగి మృతిచెందాడు. రాజలింగాలకు చెందిన సాహిత్ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వారం కిందట సెలవులపై ఇంటికొచ్చాడు. గ్రామంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపాడు. ఆదివారం అర్ధరాత్రి వరకూ ఊరేగింపులో స్నేహితులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నాడు.
స్నానానికి వెళ్లొస్తానని
పొద్దునే లేచి స్నానానికి వెళ్లొస్తానంటూ సాగర్కాలువలో ఈతకెళ్లాడు. లోతు ఎక్కువగా ఉన్నచోట ఉద్ధృతికి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు, గ్రామస్థులు గాలించగా మృతదేహం లభ్యమైంది. ముందురోజు వరకూ తమతో తిరిగిన స్నేహితుడి మరణాన్ని స్నేహితులు జీర్ణించుకోలేక పోయారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు అకాలమరణంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ మధ్య కాలంలో సాగర్ కాలువలో పడి పలువురు మృతిచెందడం స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తోంది.
ఇదీ చదవండి: ఆర్టీసీ, ఓమిని కారు ఢీ... ముగ్గురికి గాయాలు