ఖమ్మం నగరంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. కోట్ల విలువైన సర్కార్ భూముల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని స్వాహా చేసేందుకు అక్రమార్కులు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. నగరంలో సుమారు రెండున్నర కోట్ల విలువైన భూమిలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. 2014లో సదరు భూమిలో కొంతమంది గుడిసెలు వేసుకోగా.. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అంటూ వాటిని తొలగించారు. దానిని ఎన్నెస్పీ భూమిగా పేర్కొంటూ మార్క్ చేశారు. 7 ఏళ్ల తర్వాత ఇది తమ భూమి అంటూ ఇతరులు ఏకంగా నిర్మాణం ప్రారంభించారు. ఇటీవల అర్బన్ రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రాథమికంగా ఎన్నెస్పీ భూమిగా నిర్దారించారు. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సదరు వ్యక్తికి ఆదేశాలు జారీ చేసినా.. నిర్మాణం మాత్రం ఆగటం లేదు. గతంలో ఇదే స్థలంలో తాము గుడిసెలు నిర్మించుకుంటే తొలగించిన అధికారులు ఇప్పుడు నిర్మాణాలు సాగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కబ్జాదారుల చెరలో..
ఇలా ఈ ఒక్కచోటే కాదు.. ఖమ్మంలో అనేక ప్రాంతాల్లో నాగార్జున సాగర్ కాల్వ భూములు కబ్జాదారుల చెరలో చిక్కుకొని అన్యాక్రాంతమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎన్నెస్పీ భూములు 18 వేల ఎకరాలకు పైగా ఉన్నట్లు జలవనరుల శాఖ అధికారులు గుర్తించారు. వీటిలో 2 వేల ఎకరాలకు మాత్రమే మ్యుటేషన్లు చేశారు. మిగిలిన భూములపై సమగ్ర సర్వే జరుగుతోంది. ఇంకా 15 వేల ఎకరాల విస్తీర్ణంలో భూములకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంది. వీటిలో వేల ఎకరాల భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లోనే ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మంలోనే ఎన్నెస్పీ భూములు, నాగార్జున సాగర్ కాల్వ భూములు కలిపి 500 ఎకరాలకుపైగానే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం దాదాపు 200 ఎకరాల వరకు ఎన్నెస్పీ భూములిచ్చారు. మిగిలిన వందలాది ఎకరాల భూమి చాలా వరకు ఆక్రమణలకు గురవుతోంది. శ్రీరాంనగర్ కాలనీ, ధంసలాపురం, ఎన్నెస్పీ క్యాంపు, రాంచంద్రయ్యనగర్ ప్రాంతాల్లోని సాగర్ భూముల్లో ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లాతో పాటు నగరంలో అసలు ఎన్నెస్పీ భూముల వివరాలపై కనీసం రికార్డు కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఉపేక్షించేది లేదని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాజకీయ అండదండలున్నాయంటూ..
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లిన సమయంలో అధికారులపైనే ఆక్రమణదారులు తమ రాజకీయ పలుకుబడి చూపుతున్నారు. రాజకీయ అందడండలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగటంతో అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా కోట్ల విలువైన ప్రభుత్వ భూములు నానాటికీ అన్యాక్రాంతం అవుతున్నాయి.
ఇదీ చదవండి: CM KCR: మూడు రోజులు దిల్లీలోనే కేసీఆర్.. నేడే పయనం.. అందుకేనా?