ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో మంగళవారం 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతంలో ఏపీ తీరానికి దగ్గర 1,500 ఎత్తున ఉపరితల గాలుల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి తేమగాలులు తెలంగాణ వైపు బుధ, గురువారాల్లో వస్తాయా అని వాతావరణ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుత నైరుతి రుతుపవనాల గాలులు బలహీనంగా వీస్తున్నాయి. తేమ గాలులు తెలంగాణలోకి రానందున పొడివాతావరణమేర్పడి ఎండ తీవ్రత అధికమవుతోంది.
తేమగాలులు, మేఘాలు లేనందున సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి భూ వాతావరణం త్వరగా వేడెక్కుతోంది. పొడిగాలులు వీస్తున్నప్పుడు గాలిలో తేమ తగ్గిపోతుంది. అప్పుడు సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతకన్నా 5 డిగ్రీలు ఎక్కువ ఉన్నంత వేడి మనిషి శరీరానికి తగులుతుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణంకన్నా 20 శాతం తక్కువగా ఉంటోంది. ఇలాంటి వాతావరణం వల్లనే ఉక్కపోతలు ఉంటున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. బుధ, గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని రాజారావు తెలిపారు. మంగళవారం అత్యధికంగా లక్ష్మీసాగర్(సంగారెడ్డి జిల్లా)లో 5.4, మగ్ధుంపల్లిలో 5, షాబాద్(రంగారెడ్డి)లో 4.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం