Harish Rao Fires on Opposition Parties : ఖమ్మం జిల్లా ఆసుపత్రికి అనుసంధానంగా మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేడు ప్రారంభించారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకున్న హరీశ్‌రావుకు బీఆర్‌ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ముందుగా జిల్లా ప్రభుత్వాసుపత్రికి అనుసంధానంగా మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 100 సీట్లతో అనుమతి పొందిన ఈ వైద్య కళాశాల కోసం ప్రభుత్వం రూ.166 కోట్లు కేటాయించింది. పాత కలెక్టరేట్ భవనాన్ని వైద్య కళాశాలకు కేటాయించగా.. అదనంగా మరో రూ.ఎనిమిదిన్నర కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టారు. మంత్రి పువ్వాడ, ఎంపీలు నామ, వద్దిరాజు, పార్థసారథి రెడ్డితో కలిసి వైద్య కళాశాలను ప్రారంభించిన హరీశ్‌రావు.. మెడికల్ కాలేజీలోని సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత వైద్య కళాశాలలో సిల్వర్ జూబ్లీ బ్లాక్‌ను మంత్రి ప్రారంభించారు. మమత వైద్య సంస్థల వ్యవస్థాపకులు పువ్వాడ నాగేశ్వరరావు 85వ జన్మదిన వేడుకలకు హాజరైన మంత్రి.. హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు అనేలా కాంగ్రెస్ నేతలు మార్చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. అధికారంలోకి వస్తామన్న హస్తం నేతల మాటలు మేకపోతు గాంభీర్యమేనని ఎద్దేవా చేసిన ఆయన.. బీఆర్‌ఎస్‌ది టన్నుల సంస్కృతి అయితే... కాంగ్రెస్‌ది తన్నుల సంస్కృతి అని ఎద్దేవా చేశారు.
బీజేపీ నాయకులు పాలమూరు ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు అనేలా కాంగ్రెస్ నేతలు మార్చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులను కూడా ప్రతిపక్షాలు స్వాగతించలేని దుస్థితిలో ఉన్నాయి. ఎన్నో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు యత్నించాయి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. పాలమూరు ప్రాజెక్టు ఆగలేదు. - మంత్రి హరీశ్‌రావు
ప్రజలకు అవసరమైన పనులనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పని చేసే ప్రభుత్వాలనే ప్రజలు మళ్లీ మళ్లీ కోరుకుంటారని తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో నోబెల్స్‌కు, గోబెల్స్‌కు మధ్య పోరాటం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే వస్తున్నాయన్న ఆయన.. అతి తక్కువ ఫీజుకే పేద విద్యార్థులు వైద్య విద్యను పూర్తి చేసుకుంటారని అన్నారు. ధాన్యం, వైద్యుల ఉత్పత్తిలో ఇప్పుడు తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని వివరించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలుస్తోందన్న మంత్రి.. ఇప్పుడు ఏ కాలంలో చూసినా కాలువల్లో నీరు పారుతోందని హర్షం వ్యక్తం చేశారు.
Bhatti Vikramarka VS Harish Rao : దేశానికి వైద్యం అందించే శక్తిగా రాష్ట్రం ఎదుగుతోంది: హరీశ్ రావు
ప్రజలకు అవసరమైన పనులనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోంది. పని చేసే ప్రభుత్వాలనే ప్రజలు మళ్లీ మళ్లీ కోరుకుంటారు. వచ్చే ఎన్నికల్లో నోబెల్స్‌కు, గోబెల్స్‌కు మధ్య పోరాటం జరుగుతుంది. కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే వస్తున్నాయి. ధాన్యం, వైద్యుల ఉత్పత్తిలో ఇప్పుడు తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంది. - హరీశ్‌రావు
ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుసంధానంగా ఖమ్మం గ్రామీణ మండలం మద్దులపల్లిలో ఏర్పాటు చేసే నర్సింగ్ కళాశాలకు హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ బహిరంగ సభకు హాజరైన మంత్రి.. ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న తీరుపై మండిపడ్డారు. డబ్బులతో జనం హృదయాన్ని గెలవలేరని హరీశ్‌రావు హితవు పలికారు.
'నూతన మెడికల్ కాలేజీల ప్రారంభంతో వచ్చే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి'