హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 8 కిలోల గంజాయి, 8 చరవాణీలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ వెల్లడించారు. శంషాబాద్ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన తుమ్మ భానుతేజరెడ్డి, దుబ్బాక సాయి నరేష్, కర్నాటి అఖిల్, షేక్ నయీం, కొండ సాయికుమార్ గంజాయికి బానిసలుగా మారారని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని శ్రీమల్లె కాలనీలో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. సీలేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్టేవేర్ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు రోడ్డున పడింది!