ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో నియంత్రిత సాగు పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులు, శాస్త్రవేత్తలు సాగు పద్దతులు, వానాకాలం పంటలలో అనువైన రకాలు వంటి అంశాలను వివరించారు. వ్యవసాయ రంగంలో మార్పులు చేపట్టి అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు విధి విధానాలు ప్రవేశపెట్టిందని తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ముందుకు సాగుతూ... మంచి దిగుబడులు, లాభాలు పొందాలని అధికారులు సూచించారు. మొక్కజొన్న సాగు ఆపాలని, అపరాలు, వరి మాత్రమే సాగు చేసుకోవాలని జేడీఏ ఝాన్సీలక్ష్మీ కుమారి పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలన్నారు. అనుమతులు ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు.