కృష్ణా నదీ జలాల నిర్వహణ మండలి సమావేశంలో కృష్ణా నది నుంచి నీటిని రెండు రాష్ట్రాలు ఖరీఫ్, రబీ సీజన్లలో వాడుకోగా ఇంకా 25 టీఎంసీలు మిగులు ఉన్నట్లు ఇరు రాష్ట్రాల అధికారులు తేల్చారు. ఈ మిగులు నీటిని ఈనెల 31వ తేదీ వరకు సరఫరా చేసేందుకు కాలువల వారీగా షెడ్యూల్ రూపొందించారు. నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఈరోజు రాత్రికి పాలేరు జలాశయానికి నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలోని 300 పైగా చెరువులు, కుంటలు, వైరా, లంకాసాగర్ జలాశయాలను పూర్తి స్థాయిలో నీటితో నింపనున్నారు.
28న పాలేరు జలాశయంలో చేపల వేట
పాలేరు జలాశయంలో ఈ నెల 28న చేపల వేట ప్రారంభించాలని మత్స్యశాఖ ఏడీ బుచ్చిబాబు ఆధ్వర్యంలో మత్స్య సహకార సంఘం శనివారం నిర్ణయించింది. లాక్‌డౌన్ నిబంధనలు పాటించి వేట కొనసాగించాలని ఏడీ సూచించారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఇస్లావత్ ఉపేందర్, కార్యదర్శి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.