వృద్ధాప్యంలో ఎవరూ లేక పార్టీ స్తూపం కింద తలదాచుకున్న ఓ వృద్ధుడిని అక్కున చేర్చుకునేందుకు దాతలు ముందుకు వచ్చారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఆరికాయలపాడులో పార్టీ స్తూపం కింద అచేతన స్థితిలో ఉన్న వీరారెడ్డి అనే అభాగ్యుడి ధీన పరిస్థితిపై 'ఈటీవీ భారత్- ఈనాడు' కథనం ప్రసారం అయింది. కథనానికి స్పందించిన దాతలు.. వీరారెడ్డిని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు.
కథనానికి స్పందించి
ఆరికాయలపాడు కూడలిలో పార్టీ స్తూపానికి ఉన్న పిల్లర్ల నడుమ మంచం వేసుకుని అదే నివాసంగా మలుచుకున్నాడు వీరారెడ్డి. కొద్ది ఎత్తులో ఉన్న ఆ గూటిలోకి వెళ్లలేక అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. కర్ర ఊతంతో అడుగులో అడుగు వేస్తూ యాచిస్తూ ఆహారం సమకూర్చుకున్నాడు. అతడి ధీన పరిస్థితిని 'ఈటీవీ భారత్- ఈనాడు' ప్రచురితం చేసింది. స్పందించిన దాతలు తామంటే తామంటూ ఆశ్రమాలకు తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చారు. చివరకు ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు.. తన అంబులెన్స్‌లో ఆశ్రమానికి తీసుకెళ్లారు.
మానవత్వంతో ముందుకు
వీరారెడ్డి ధీనస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చలించారు. హైదరాబాద్‌కు చెందిన రెడ్డి కార్పొరేషన్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ సహకారం ఇస్తామని ముందుకు వచ్చారు. ఐసీడీఎస్ అధికారులు తమ శాఖ ద్వారా వయో వృద్ధుల ఆశ్రమానికి తరలించే ఏర్పాట్లు చేశారు. స్థానికంగా గాయత్రి హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు కొలిశెట్టి నరేశ్ దుస్తులు అందించి ఆశ్రమానికి తరలించేందుకు సహకరించారు. ఎస్సై శ్రీకాంత్.. వీరారెడ్డికి నివాసం కల్పించేందుకు ముందుకు వచ్చారు. సర్పంచి ముత్తమ్మ, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు సహకారం అందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: నా అన్నోళ్లు లేకపాయె... స్మృతి స్తూపమే ఆవాసమాయె!