ఓ వైపు రోజురోజూ అభివృద్ధి వెలుగులతో ముందుకుపోతున్న ఖమ్మం నగరంలో... కనీస మౌలిక సదుపాయలు లేక ప్రజలు కొట్టు మిట్టాడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని డివిజన్‌గా ఉన్న దానవాయిగూడెం కాలనీ వాసుల పరిస్థితి ఇది.
చెరువును తలపిస్తున్న కాలనీ...
ఏడాదిలో ఏ ఒక్క సీజన్లోనూ దానవాయిగూడెం కాలనీ వాసులకు సంతోషం అన్నమాటే ఉండదు. వేసవి కాలంలో.. స్థానికంగా ఉన్న డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్వాసనతో తల్లడిల్లిపోతారు. వర్షాకాలం.. వారికి కొత్త సమస్య వస్తోంది. కాలనీలో ఎక్కడా కనిపించని మురుగు నీటి వ్యవస్థ, కనీసం వర్షపు నీరు వెళ్లే మార్గంలేక... కాలనీ వర్షపునీటితో నిండిపోయి చెరువుని తలపిస్తుంది. ఇప్పటికే దాదాపు 20 రోజులుగా కాలనీవాసులంతా...వాననీటి గుప్పిట్లోనే బతుకీడుస్తున్నారు. సాయంత్రం వేళ కనీసం ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి. పిల్లల్ని ఒంటరిగా బయటకు పంపాలంటేనే వీరంతా హడలెత్తిపోతున్నారు. ఇలా దాదాపు 4 నెలల పాటు తమ పిల్లల్ని కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిందేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్యం లోపించి దోమల వల్ల విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రజానీకం ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రతీ వర్షాకాలంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కాలనీ వాసులు తమ కష్టాలు తీర్చాలని మొరపెట్టుకోవడం... వారు పట్టించుకోకపోవడం పరిపాటిగానే మారింది. ఈసారైనా అధికారులు స్పందించి... తమ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని దానవాయిగూడెం వాసులు వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి :హుజూర్‌నగర్‌లో వేడెక్కిన రాజకీయం...