Bhatti in padayatra: రాష్ట్రం ఏర్పడ్డాక ఎలాంటి లక్ష్యాలను సాధించలేక పోయామని.. రాష్ట్ర సంపద పక్కదారి పట్టిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో రెండురోజు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ముదిగొండ మండలంలోపాదయాత్ర రెండో రోజు కొనసాగించారు.
రాష్ట్ర విభజనకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా కాంగ్రెస్లో సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ని ప్రజలు నమ్మి ఓటేస్తే పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఎనిమిదేళ్ల కాలంలో రూ.15 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు.
ఫీల్ అసిస్టెంట్లను అన్యాయంగా తొలగించారు
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన వైకుంఠ ధామాలు, నర్సరీలు తప్ప ఎలాంటి అభివృద్ధి కనిపించటం లేదన్నారు ప్రజలను చైతన్యం చేసేందుకు రాష్ట్రమంతా తిరుగుతామని భట్టి స్పష్టం చేశారు. ప్రజలకు పంచాల్సిన డబ్బు కొంత మంది చేతుల్లో ఉందన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని.. వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలతో రైతులు కుదేలవుతూనే ఉన్నారన్నారు. తెరాస ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
నిరుద్యోగుల వయసైపోతోంది
రాష్ట్రంలో నియామకాలు చేపట్టకపోవడంతో ఒక తరం వయసైపోతోందని సీఎల్పీ నేత అన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన వారంతా ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని భట్టి విక్రమార్క కోరారు.
మొదటిరోజు 18 కి.మీ. మేర పాదయాత్ర
ముదిగొండ మండలం యడవల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆదివారం ప్రారంభించారు. కుటుంబ సమేతంగా ఆలయంలో పూజలు చేశారు. తొలిరోజు యడవల్లి, మాధాపురం, కట్టకూరు, మేడేపల్లి, యడవల్లి లక్ష్మీపురం, ముదిగొండ గ్రామాల్లో 18 కి.మీ. మేర పాదయాత్ర చేపట్టారు. గ్రామాల్లో భట్టికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్ర విభజన సమయంలో మేం చాలా లోతుగా ఆలోచించాం. ప్రత్యేక రాష్ట్రం సాధించాక ఇప్పటివరకు ఏ లక్ష్యాలు నెరవేరలేదు. కొద్దిమందికే సంపద అంతా పరిమితమైపోతోంది. బడ్జెట్ పెట్టిన ప్రతిసారీ సంపద ఎటుపోతోంది. లక్షల కోట్ల కొద్ది అప్పులు చేస్తున్నారు. పింఛన్లు, ఉద్యోగాలు, ఇళ్లు ఏమయ్యాయి. నిరుద్యోగుల వయసైపోతున్నా ఇంతవరకు నోటిఫికేషన్లు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. ఇది కాదు కదా మన కోరుకుంది. ఎనిమిదేళ్లలో ప్రజలకు జరిగినా అభివృద్ధి అంటూ ఏమీ లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తే వారు ఏటు పోవాలి. ఎన్నికల్లో ఇచ్చినా ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా??.- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చూడండి: