BJP Meeting in Khammam Today : బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం, కాంగ్రెస్ ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణతో దూకుడు కొనసాగిస్తుడటంతో.. ఖమ్మం గడ్డపై నుంచి అసెంబ్లీ పోరుకు బీజేపీ(BJP) సమర భేరీ మోగించనుంది. సాయంత్రం "రైతు గోస-బీజేపీ భరోసా" పేరిట నిర్వహించే బహిరంగ సభ వేదికగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్న అమిత్ షా.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో దిగుతారు. తర్వాత సభా ప్రాంగణంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని వచ్చే ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. దాదాపు 20 మంది వరకు ముఖ్యనేతలు ఆ భేటీలో పాల్గొననున్నారు.
Amith Shah Khammam Tour : బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దీటుగా ముందుకెళ్లేలా.. పార్టీ నేతలకు కీలకమైన సూచనలు చేసే అవకాశం ఉంది. అనంతరం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ప్రస్తుత జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయాల నేపథ్యంలో అమిత్‌షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
బీజేపీ-బీఆర్ఎస్(BRS) మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టేలా ప్రసంగం సాగే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. తొలిసారి అమిత్ షా ఖమ్మం వస్తుండటంతో బహిరంగ సభ విజయవంతానికి కమలం నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు.
Amith Shah Meeting in Khammam : 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలిస్తున్నారు. బీజేపీ ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ పాటు నేతల కటౌట్లతో ఖమ్మం కాషాయమయంగా మారింది. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో సభాస్థలి తీర్దిదిద్దారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చే ముఖ్య నేతలు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానుండటంతో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
శనివారం సాయంత్రానికే బహిరంగ సభాస్థలిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రెండ్రుజుల క్రితమే సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు శనివారం ఖమ్మం చేరుకున్నాయి. అమిత్ షా హెలికాప్టర్ దిగే సర్దార్ పటేల్ మైదానం నుంచి సభా వేదిక వరకు అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ సమీక్షించారు.
"ఈ రోజు ఖమ్మంలో జరిగే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు బీజేపీకి మద్దతిస్తున్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో సభకు రావడానికి సుముఖం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఖమ్మం సభకు రావడానికి వీలుగా అన్ని ఏర్పాట్లను చేశాం". - ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్