ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా మార్కెట్ యార్డును ఆయన స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నెలరోజులుగా లారీలు రాక, ఎగుమతులు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాలు మరింత కుంగతీస్తున్నాయని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించకుండా.. అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, ఇప్పటికైనా ఎగుమతులు వేగవంతం చేయాలని కోరారు.
మిల్లులకు తరలించిన ధాన్యాన్ని తరుగు పేరుతో ఇష్టం వచ్చినట్లు కటింగ్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకులు, మండల నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Corona Death: ఒకరి తర్వాత ఒకరు.. ఒకేరోజు ముగ్గురు మృతి