రైతుల అభ్యున్నతి కోసం తెరాస ప్రభుత్వం నిరాటంకంగా కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తన తల్లిదండ్రులు జ్ఞాపకార్థం నిర్మించిన రైతు వేదిక భవన్‌ను మంత్రి ప్రారంభించారు.
రైతులను అభివృద్ధి పరిచే విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. యాసంగిలో రైతుబంధు కింద రూ. 7515 కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటికే 58 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులు జమ చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేయటం లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని సైతం సరిగా ఇవ్వడంలేదని అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో సైతం రైతు వేదిక భవన్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రవాణా మంత్రి అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర్లు, కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు