ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చందిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు దరిపల్లి శేషయ్యకు ముగ్గురు కుమార్తెలు. కుటుంబ పోషణ నిమిత్తం కూతుళ్లకు తన విద్యను తన విద్యను నేర్పించారు. ఆ ముగ్గురు వల్లభి సిస్టర్స్గా గుర్తింపు సాధించారు. ఆ తర్వాత ముగ్గురికీ పెళ్లిళ్లు కాగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఖమ్మం నగరంలో కాల్వొడ్డు ప్రాంతంలో స్థిరపడిన లక్ష్మి మాత్రం తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నాన్న వద్ద నేర్చుకున్న నాదస్వరం విద్యను ఉపాధిగా మలుచుకున్నారు. 2009 నుంచి భర్తతోపాటు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పలు దేవాలయాలు, వివాహ, శుభకార్యాల్లో నాదస్వరం వాయిస్తున్నారు. తనతోపాటు ఆరో తరగతి చదువుతున్న తన కూతురు హిమబిందుకు సైతం నాదస్వర విద్యను నేర్పిస్త్తూ మూడోతరానికి కళను పరిచయం చేస్తున్నారు.
ప్రతిభతో అనేక అవార్డులు
నాదస్వర వాద్యంలో తనకే సొంతమైన ప్రతిభతో ఈమె అనేక అవార్డులు దక్కించుకున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం నుంచి బెస్ట్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ అవార్డు పొందారు. ఖమ్మం పౌరసమితి సంస్థ నుంచి స్త్రీ శక్తి పురస్కారం పొందారు. 2019లో ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో సిలికాన్ ఆంధ్రా పురస్కారం అందుకున్నారు. ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'కళా నంది' అవార్డు సొంతం చేసుకున్నారు. వీటితోపాటు పలు స్వచ్ఛంద సంస్థల నుంచి లక్ష్మికి పురస్కారాలు అందాయి. కుమార్తెకుకు గుర్తింపు రావడం పట్ల ఆమె తండ్రి శేషయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సహకారం అందించండి..
కళాకారిణిగా రాణిస్తూనే..వారసత్వ కళను కాపాడుతున్న లక్ష్మీకి ఆర్థిక కష్టాలు మాత్రం తప్పడం లేదు. తాను చేసే ప్రదర్శనలతో ఇల్లు గడిచేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని చెబుతోంది. ప్రభుత్వం తనను గుర్తించి సహకారం అందించాలని కోరుతోంది.
ఇదీ చదవండి: DALITHABANDHU: దళితబంధు పథకంలో రవాణా వాహనాలకే మొదటి ప్రాధాన్యత