కరోనా నిర్ధారణలో జరిగిన తప్పిదం వల్ల మృతదేహంతో కుటుంబ సభ్యులు సుమారు ఆరు గంటలకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లా ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరి సమీపంలో నివసించే ఓ వ్యక్తి మూడు రోజులుగా ఆయాసంతో బాధపడుతున్నాడు.
సోమవారం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా కరోనా నెగిటివ్ వచ్చింది. అతను చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు.
కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా పీహెచ్‌సీ సిబ్బంది వచ్చి మృతిచెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని సిబ్బంది చెప్పారు.
కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని అప్పగించేందుకు ఒప్పుకోలేదు. తహసీల్దార్, సీఐ, ఎస్సై, వైద్యురాలు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి.. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.