లాక్‌డౌన్ వల్ల ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండి... బయట ఉపాధి లభించని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో కరీంనగర్ కార్పొరేషన్., జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో... పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు మాస్కులు రూపొందిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ వీటిని తయారు చేసి... సేవా దృక్పథంతో వైద్యులకు, పోలీసులకు, స్థానిక ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు.
మాస్కుల తయారీకి కావాల్సిన క్లాత్, ఎలాస్టిక్ అందివ్వడం వల్ల ఇబ్బంది లేకుండా మారింది. వివిధ రంగుల్లో వీటిని తయారు చేసి సిద్ధంగా ఉంచుతున్నారు. తయారీలో కొందరు మహిళా సంఘాల సభ్యులు ఉచితంగా కుట్టి ఇస్తుండగా, మరికొందరు నామమాత్రంగా కుట్టి ఇచ్చే వారికి చెల్లిస్తున్నారు. ప్రజలకు, అత్యవసర సిబ్బందికి, పని చేసే ఉద్యోగులకు పంపిణీ చేయడం వల్ల సమస్యలు దూరమయ్యాయి.
నగరపాలిక ఒక్కరోజే 2వేల మాస్కులు పంపిణీ చేసింది. కరీంనగర్‌లో 6, జమ్మికుంటలో 9 మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 18 వేల మాస్కులు తయారు చేసి... ఆయా మున్సిపాలిటీలకు సరఫరా చేశారు. ఒక్కో మాస్కు రూ.10కే అందించారు. తయారీకి రూ.8.50 ఖర్చు అవుతుందని సంఘాల సభ్యులు అంటున్నారు. అత్యవసర విధుల్లో మాస్కులు లేని వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు నగరపాలిక ఆర్‌పీ మంజుల పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రద్దయిన రైలు టికెట్లకు పూర్తి రీఫండ్