కవలలుగా జన్మించిన అక్కాచెల్లెళ్లు.. వారి వారి ప్రసూతిల్లోనూ వారసత్వాన్ని కొనసాగించారు. ఇలాంటి అరుదైన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకొంది. పట్టణంలోని విలాసాగర్కు చెందిన నిఖిత, లిఖిత ఇద్దరు కవలలుగా జన్మించారు. పెళ్లిళ్ల తర్వాత ఒకరు నాగులమల్యాల మరొకరు విలాసాగర్‌లో ఉంటున్నారు.
మూడు నెలల క్రితం నిఖిత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవల లిఖిత కూడా వైద్య పరీక్షల కోసం వెళ్లినప్పుడు డాక్టర్ ఆకుల శైలజ.. లిఖితకు ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు పుట్టే అవకాశం ఉందని చెప్పారు. డెలివరీ సమయంలో వైద్యురాలు సూచించినట్లుగా లిఖిత నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. లిఖితకు ఇద్దరు మగశిశువులు కాగా ఇద్దరు ఆడశిశువులు జన్మించారు.
ఒక శిశువును మోయడమే ఇబ్బందిగా ఉంటుందని.. అక్కాచెల్లెళ్లు ముగ్గురు, నలుగురు చొప్పున మోయడం గొప్ప విషయమని డాక్టర్ శైలజ అన్నారు. ఏడు లక్షల జంటల్లో ఒకరికి ఇలాంటి అరుదైన అవకాశం ఉంటుందని డాక్టర్ పేర్కొన్నారు. కవల పిల్లలకు ఇలా సేవచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వైద్యురాలు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: PUVVADA ON KISHAN REDDY: రాష్ట్రానికి ఏం మేలు చేశారని.. కిషన్రెడ్డి యాత్రలు చేస్తున్నారు?