కరీంనగర్ శివారులోని దిగువ మానేరు జలాశయం 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు గేట్లన్నీ తెరవడం వల్ల జలాశయ సందర్శనకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు. మూడ్రోజులుగా ఏకధాటిగా మోయతుమ్మెద వాగుతో పాటు మధ్యమానేరు నుంచి భారీగా వరద వస్తుండటం వల్ల దిగువ మానేరు వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది.
దాదాపు 72 వేల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతుండటం వల్ల గేట్ల నుంచి కిందకు జారిపడుతున్న నీరు ప్రాజెక్టుకు అందాలను తెచ్చిపెడుతున్నాయి. కరీంనగర్‌తో పాటు జగిత్యాల జిల్లాల నుంచి ప్రజలు మానేరు అందాలు చూడటానికి తరలివస్తున్నారు. నీటి ప్రవాహం వద్ద సెల్ఫీలు దిగుతూ ఆనంద పడుతున్నారు. సాయంత్రం వేళ పర్యకులు ఎక్కువగా వస్తున్నందున.. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.