కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తెరాస నాయకులు రెండుసార్లు శంకుస్థాపన చేశారు. ఆ శిలాఫలకాలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం సందర్శించారు. నిర్మాణ పనులేవి మొదలు పెట్టలేదని విమర్శించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పేరిట పేద ప్రజలను తెరాస మోసగిస్తోందని సత్యం ఆరోపించారు. సువిశాల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి 2014లో తొలిసారిగా తెరాస అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే ఆ హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేక పోయిందని విమర్శించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పేద ప్రజలకు ఎన్ని ఇళ్లు కట్టించిందో చెప్పాలని.. జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేకు సవాల్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు చిన్నగా ఉన్నాయని అవహేళన చేసిన కేసీఆర్.. ఆరేళ్లుగా కాలాయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు చూపుతామన్న నాయకులు 3వేల ఇళ్లు కూడా చూపించలేదని ధ్వజమెత్తారు. సత్వరం పేద ప్రజలకు ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ప్రజా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే తీరు హాస్యాస్పదం: మేడిపల్లి సత్యం