కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇంటిదొంగలు పెరిగిపోయారు. ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నులు కార్యాలయంలో జమచేయకుండా తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజలు ఆన్‌లైన్ చెల్లింపులకే ప్రాధాన్యమిస్తుండటంతో బిల్ కలెక్టర్లకు నగరపాలక సంస్థ స్వైపింగ్ యంత్రాలను సమకూర్చింది. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరంలో వసూలైన పన్నులకు కార్యాలయంలో జమచేసిన సొమ్ము మధ్య తేడా కనబడటంతో అధికారులు దృష్టిసారించారు.
దాదాపు రూ.50లక్షలు జమచేయలేదని ప్రాథమికంగా వివరాలు సేకరించిన నగరపాలక కమిషనర్ క్రాంతి... బిల్ కలెక్టర్ శశికుమార్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా మరో 17 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్వైపింగ్ ద్వారా డబ్బు వసూలు చేసి నగరపాలక సంస్థ ఖాతాలో ఎందుకు జమ చేయలేదో మూడురోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించారు. లేని పక్షంలో రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ క్రాంతి హెచ్చరించారు.