కరీంనగర్ తీగులగుట్టపల్లికి చెందిన షేక్ సయిదా (Shaik Saida) నేర్పరితనం చూసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు. తమ ప్రాంతంలో పాము వచ్చిందనే సమాచారం అందుకోవడంతోటే ఉరుకులు పరుగులతోనే చేరుకుంటోంది. రాత్రి పగలు ఎప్పుడైనా సరే పాము కనిపించిన ప్రాంతానికి చేరుకొని ప్రాణాలకు తెగించి పట్టుకొని ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతోంది.
వేల సంఖ్యలో...
చిన్నతనం నుంచే పాములను అలవోకగా పట్టుకుంటుండగా... ఇప్పటి వరకు వేలసంఖ్యలో పాములను పట్టుకొంది. రాత్రిళ్లు అయితే ఆ ప్రాంతంలోని వీధి దీపాలను ఆర్పేసి చాలా జాగ్రత్తగా పాము అలికిడి విని క్షణాల్లో బంధించేస్తుంది. ఎలాంటి విష సర్పాన్ని అయినా ఎంతో నేర్పుగా పట్టుకోవడం అలవాటుగా మార్చుకొంది. జాగ్రత్తగా పామును పట్టుకుని దాని కాటుకు గురికాకుండా అటవీశాఖకు అప్పగించడం లేదా సుదూర ప్రాంతాల్లో వదిలి వస్తుంటామని చెబుతోంది. తన కుమారునికి పాములు పట్టడం నేర్పినప్పటికీ నాలుగైదు సార్లు పాము కుట్టిందని చెబుతోంది సయిదా. ఎప్పుడు పాము వచ్చినా అది తమ చేతికి చిక్కే వరకు ప్రాణాలతో చెలగాటం ఆడినట్లుగానే ఉంటుందని అంటోంది.
తప్పటం లేదు...
ఈ వృత్తి నిత్యం ప్రాణాంతకమైనా విధిలేక ఇలా పాములను పట్టుకోక తప్పడం లేదని సయిదా పేర్కొంది. ప్రేమ వివాహం చేసుకున్న సయిదా... భర్త చనిపోయాక పాములను పట్టే బాధ్యత తానే తీసుకున్నట్లు చెప్పింది. ఇళ్ల నిర్మాణ పనులకు వెళుతుంటానని తెలిపింది. తన వద్ద ఒక రాయి ఉంటుందని ఆ రాయి ఉన్నంత వరకు పాము కాటు వేయదని ఆమె వెల్లడించింది. ఆ రాయి లేకుండా పామును పట్టుకోవడానికి వెళ్లిన కుమారుడు ససీర్‌కు అయిదారు సార్లు కాటు వేసిందని చెబుతోంది.
ప్రభుత్వం సాయం చేయాలి...
ఆయుర్వేద వైద్యంతోనే ప్రాణాలను కాపాడుకుంటామంటున్నామని సయిదా తెలిపింది. తన కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న తానూ పాము కాటుకు గురైతే తన కుటుంబ పరిస్ధితి ఏంటన్న ఆందోళన వెంటాడుతోందని ఆందోళన వెలిబుచ్చింది. పాములను ధైర్యంతో పట్టుకుంటున్నా.. ఎప్పుడు భవిష్యత్తు గురించి బెంగ వేధిస్తోందని అంటోంది. ప్రభుత్వం పేదలకు అందించే సహాయాన్ని తన కుటుంబానికి అందించి ఆదుకోవాలని వేడుకుంటోంది.
ఇదీ చదవండి: Film Chamber: మంత్రి తలసానితో చలనచిత్ర వాణిజ్య మండలి భేటీ