Science museum Dilapidated in Karimnagar: కరీంనగర్ సైన్స్ మ్యూజియంలోకి అడుగు పెట్టగానే విద్యార్ధుల కళ్లు చెదిరిపోయే ప్రయోగాలు కనిపించేవి. రసాయనాల్లో భద్రపరిచిన జంతు, వృక్ష అవశేషాలు విద్యార్ధిలోకాన్ని ఆలోచింపజేసేవి. 17 ఏళ్ల క్రితం దాదాపు 20 లక్షలు వెచ్చించి ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విద్యార్దులు వచ్చి ప్రయోగాలను చూసేవారు. ఈ ప్రయోగాలు వారిని ఎంతగానో ఆకర్షించేవి.
కానీ ఇప్పుడు క్రమంగా నిర్వహణకు నిధులు రాకపోవడంతో ఒక్కో పరికరం వృథాగా మూలనపడుతూ వస్తోంది. అధికారులు సైతం ఉదాసీనత కనబరుస్తూ వచ్చారు. ఫలితంగా అందరినీ ఆకర్షించిన మ్యూజియంలోని పరికరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 2014నుంచి కనీసం విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం కూడా నిధులు రాకపోవడంతో కరెంటు సరఫరాను నిలిపివేశారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"సైన్స్ మ్యూజియంలో కనీసం నాలుగు సబ్జెక్టుల సైన్స్ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉన్నత పాఠశాలలో కొరత ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ సైన్స్ మ్యూజియంకు వచ్చి.. ఆసక్తిగా అన్నీ తిలకించేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు." - తిరుపతి, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి
ఈ మ్యూజియంలో 60కు పైగా ప్రయోగాలు అందుబాటులో ఉండేవి. సైన్స్ మ్యూజియంలో భౌతిక, రసాయన, జీవశాస్త్రం, గణితంతోపాటు ఆసక్తికరమైన ప్రయోగాలు వీక్షించే అవకాశం ఉండేది. క్రమంగా దీని నిర్వహణకు నిధులు నిలిచిపోగా సిబ్బంది సైతం లేకపోవడంతో నిర్వహణ కష్టంగా మారింది. అప్పుడప్పుడు ఉన్నతాధికారులు సైన్స్ మ్యూజియం సందర్శించినా సమస్యలు పరిష్కరించడానికి ఉత్సాహం చూపలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఆరుబయట ఏర్పాటు చేసిన ప్రయోగాల పరికరాలతోపాటు భవనం సైతం శిథిలావస్థకు చేరుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్‌లోని మ్యూజియమే విద్యార్దులను ఆలోచింపజేసేలా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఉన్న సైన్స్ మ్యూజియం... ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని విద్యార్ధి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: