loss for Telangana Rice millers : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్‌మిల్లులకు అడ్డాగా పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలు ప్రఖ్యాతి చెందాయి. వందల సంఖ్యలో రైస్ మిల్లులు ఉండటంతో సుల్తానాబాద్ బియ్యం పరిశ్రమగా పేరు పొందింది. పెద్దపల్లిలో రైల్వే సదుపాయం ఉండటంతో ప్రతి సంవత్సరం బియ్యం పరిశ్రమ వృద్ది చెందుతోంది. ఉపాధి కోసం బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వందల సంఖ్యలో కూలీలు వలస వస్తుంటారు. కేవలం సుల్తానాబాద్‌లోనే 110 రైస్‌మిల్లులు ఉన్నాయి. అయితే గత వారం కురిసిన వడగళ్ల వర్షం కారణంగా ఊహించని రీతిలో నష్టం వాటిల్లింది.
వడగండ్ల వానకు రైస్‌మిల్లులు దెబ్బతిన్నాయి: పెద్దపెద్ద వడగళ్లు రైస్‌మిల్లులపై పడటంతో పైకప్పు కాస్తా జల్లెడలా తయారయ్యాయి. లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. కస్టమ్ మిల్లింగ్‌లో ఎఫ్‌సీఐ నిబంధనలు కఠినతరం చేయడంతో సాల్టెక్స్ యంత్రాలు, బ్లెండింగ్ యంత్రాలను అమర్చుకున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల రుణాలతో కొత్త యంత్రాలను సమకూర్చుకోగా వడగళ్లు కాస్తా ఎనలేని నష్టాన్ని కలిగించాయని యజమానులు వాపోతున్నారు. ఈదురు గాలులకు కొన్నిచోట్ల రైస్ మిల్లులపై రేకులు ఎగిరిపోగా మరికొన్నిచోట్ల కప్పులకు తూట్లుపడి ధాన్యం, బియ్యం పూర్తిగా దెబ్బతిన్నాయని రైస్ మిల్లు యజమానులు ఆవేదన చెందుతున్నారు.
రూ.25 లక్షలు వరకు నష్టం జరిగింది: ఎన్నో ఏళ్లుగా రైస్ మిల్లుల పరిశ్రమను నిర్వహిస్తున్నా తమ సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోలేదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క సుల్తానాబాద్‌లో 110 రైస్ మిల్లులు ఉండగా వడగళ్లకు దాదాపు 70 రైస్‌మిల్లులు దెబ్బతిన్నాయి. ఒక్కోరైస్‌మిల్లుకు ఎంత లేదన్నా రూ.25లక్షల వరకు నష్టం జరగిందని బాధ పడుతున్నారు. ఇంత వరకు తమ సమస్యలను ఎవరు పట్టించుకున్న వారే లేరని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తమకు జరిగిన నష్టాన్ని పరిశీలించకుండానే బియ్యం సకాలంలో ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు: తమకు కలిగిన నష్టాన్ని కనీసం పరిశీలించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మిల్లర్లు సూచిస్తున్నారు. ఇప్పటికే బియ్యం వర్షపు నీటికి తడిసి ముద్దగా మారాయని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైస్ మిల్లర్లు కోరారు. అకాల వర్షానికి పంట దెబ్బతినడంతో రైతులను ఆదుకొనేందుకు పరిహారం ప్రకటించిన సర్కార్ తమకు జరిగిన నష్టంపై సర్వే నిర్వహించి తగు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: