ప్రభుత్వం, రెవెన్యూ సిబ్బంది వేరు కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల స్పష్టం చేశారు. అబ్దుల్లాపూర్మెట్లో తహసీల్దార్ సజీవ దహనం ఘటనతో కలత చెందిన రెవెన్యూ ఉద్యోగులు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి గంగుల కమలాకర్ను అడ్డుకున్నారు. సీఎంకు వ్యతిరేకంగా రెవెన్యూ ఉద్యోగులు నినాదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు వస్తే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారా అని అసహనం వ్యక్తం చేశారు.
రెవెన్యూ ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ తీరు వల్లనే ప్రజల్లో తమపై అసహనం వ్యక్తమవుతోందని రెవెన్యూ సిబ్బంది పేర్కొన్నారు. దీనికి అంగీకరించని మంత్రి... ప్రభుత్వ ఉద్యోగులై ప్రభుత్వానికే వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదని రుసరుసలాడుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు తమ సమస్యలను పరిష్కరించే వరకు రెవెన్యూ కార్యాలయాలు తెరవబోమని అధికారులు తేల్చి చెప్పారు.
- ఇదీ చూడండి : అమానుషం... అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దారుణ హత్య