కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో నిన్నటి వరకు వ్యవసాయ కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు..... దళితబంధు పథకం మంజూరుతో యజమానులుగా మారారు. హూజూరాబాద్‌లో దళిత బంధు కింద ఇప్పటివరకు 6,354 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరయ్యాయి. 5,354 మందికి వ్యక్తిగత యూనిట్లు, 61 మంది లబ్ధిదారులకు 26 రిటేల్ సెక్టార్ గ్రూప్ యూనిట్లు, 939 మంది లబ్ధిదారులకు 367 ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ గ్రూప్ యూనిట్లను మంజూరు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం అవుతోంది.
సిర్సపల్లి గ్రామానికి చెందిన మన్యాల రాధమ్మ-అయిలయ్య, చిత్తారి సుమలత- రాజేందర్ దంపతులు నిన్నా, మొన్నటి వరకు గ్రామంలో ఉన్న ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇతరుల పొలాలలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవించేవారు. దళిత బంధు పథకంలో భాగంగా... వారు హార్వెస్టర్ తీసుకున్నారు. ప్రస్తుతం కోతలు నడుస్తుండటంతో చేతినిండా సంపాదిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు చాలీచాలని ఆదాయంతో ఇబ్బందులు పడేవాళ్లమని... ఇప్పుడు అన్ని ఖర్చులు పోనూ నెలకు 4 లక్షలు ఆదాయం వస్తున్నట్లు తెలిపారు.
1389 మినీ డైరీలు, 919 మందికి ట్రాన్స్‌పోర్టు వాహనాలు, 559 మందికి సెంట్రింగ్ రూఫ్ యూనిట్లు, 233 మందికి టెంట్ హౌజ్‌లు, 75 మందికి జేసీబీలు మంజూరు చేశారు. వీరంతా కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటగా దళితబంధు పథకం అమలు చేయగా... నియోజకవర్గంలో యూనిట్లు పంపిణీ శరవేగంగా సాగుతోంది. కూలీలను యజమానులుగా తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోంది. నచ్చిన పనిలో చేతినిండా సంపాదించడంతో పాటు పలువురికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు.
ఇదీ చూడండి: