కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రం నుంచి అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 130 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని కమిషనరేట్ ప్రత్యేక విభాగం పోలీసులు పట్టుకున్నారు. బేడ బుడగ జంగాల కాలనీలో అక్రమ రవాణాకు రూ.2.6 లక్షల విలువ గల బియ్యాన్ని వ్యానులో లోడు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వాహనం ముందు భాగంలో అత్యవసర సేవల నకిలీ గుర్తింపు అతికించారు. వాహనంలో అక్రమ బియ్యం పైనుంచి వరి ధాన్యం బస్తాలు కప్పి వేకువ జామున ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ పక్కా సమాచారంతో రిజర్వ్ ఎస్సైలు జానీమియా, మల్లేశం ఆధ్వర్యంలోని పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఈ అక్రమ వ్యవహారంలో రామడుగుకు చెందిన పర్వతం గంగాధర్, కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన వాహనం యజమాని పుల్లయ్య, డ్రైవర్ మహేష్‌లపై కేసు నమోదు చేశారు.
అక్రమ వ్యవహారాలకు ఎవరూ పాల్పడవద్దని కరీంనగర్ అదనపు డీసీపీ చంద్రమోహన్ స్పష్టం చేశారు. సాంకేతికత సాాయంతో అక్రమార్కులను సత్వరమే పట్టుకుంటామని వెల్లడించారు. నిందితుల కేసులు పునరావృతమయితే పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. కమిషనర్ కమలాసన్ రెడ్డి ప్రత్యేక పోలీసు బృందాన్ని అభినందించారు. అక్రమ వ్యవహారాలకు సంబంధించిన సమాచారం అందించే వారికి పారితోషికం అందిస్తామన్నారు. పోలీసు శాఖకు సమాచారమిచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. నేరరహిత కమిషనరేట్ లక్ష్యంగా తమ శాఖ కృషి చేస్తోందని చెప్పారు.
ఇవీ చూడండి: ఎలుగుబంటి బీభత్సం.. చంపేసిన గ్రామస్థులు