కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడానికి ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతుంటే మందుబాబులు కల్లుకోసం క్యూలు కడుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి గ్రామాల్లో గుంపులు గుంపులుగా చేరి కల్లుతాగుతున్నారు. ఈ దృశ్యం అటుగా వెళ్తున్న ఓ పోలీసు కంటపడింది. ఇంకేముంది లాఠీ నోరు మాట్లాడింది. కల్లుబాబులకు మత్తువదిలింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ సమీపంలో కల్లు బాబులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఉపాధికోసం దుబాయ్ వెళ్లి ఈ మధ్య కాలంలో గ్రామానికొచ్చిన కొందరు గ్రామాల్లో బంధువులతో కలిసి కల్లు దుకాణాల వద్దకు చేరారు. గుంపులుగా కూర్చుని కల్లుమత్తులో తేలిపోతున్నారు. అటుగా వెళ్తున్న పోలీసులు వీరిని చూసి లాఠీలకు పనిచెప్పారు. గుంపులుగా కూర్చుని కల్లు తాగడం... శుభ్రత పాటించకపోవడం తదితర కారణాల వల్ల కరోనా వేగంగా విస్తరిస్తుందని అధికారులు చెబుతున్నారు. నలుగురికి చెప్పే వయసులో ఉండి ఇలాంటి దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా లక్షణాలతో రాష్ట్రంలో తొలి మరణం